బెల్టు తీస్తానన్నారు.. తడాఖా చూపించారు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ నిమిత్తం వెళ్లిన సందర్భంలో అక్కడి లబ్ధిదారుల కుటుంబాల వారితో కలిసిపోయారు. వారితో సమయం గడిపారు. వారి కష్టనష్టాలను, గ్రామాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లో మద్యం బెల్టుషాపుల వ్యవహారం కూడా సీఎం దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బెల్టుషాపులు నిర్వహిస్తే.. తాను తన బెల్టు తీయాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చరించారు.

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటె ఎక్కువకు విక్రయించే అక్రమాలకు పాల్పడుతున్నా తాటతీస్తానని గతంలోనే పలుమార్లు హెచ్చరించి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ఈ దిశగా కఠినమైన చర్యలు తీసుకున్నది. ఎమ్మార్పీ కంటె ఎక్కువకు అమ్మడం, బెల్టుషాపులు నిర్వహించడం అనే తప్పులకు పాల్పడే వారికి భారీ జరిమానాలు విధించేలా ప్రభుత్వం తాజాగా ఎక్సయిజు చట్టానికి సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.

ఏ మద్యం దుకాణంలోనైనా ఎమ్మార్పీ కంటె ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా తేలితే గనుక.. వారికి రూ.5 లక్షల భారీ జరిమానా విధించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకసారి ఈ జరిమానా పడిన దుకాణం మళ్లీ అలాంటి తప్పునేచేస్తున్నట్టు తేలితే.. ఏకంగా వారి లైసెన్సునే రద్దు చేస్తారు. అలాగే మద్యం దుకాణం పరిధిలో బెల్టు షాపులు నిర్వహిస్తే కూడా రూ.5 లక్షల జరిమానా విధించేలా చట్టానికి మరో సవరణ చేశారు.
చంద్రబాబునాయుడు నేమకల్లులో హెచ్చరించిన రెండు రోజుల్లోనే బెల్టుషాపులమీద కఠినమైన జరిమానాలు విధిస్తూ చట్టసవరణలు జరగడం విశేషం. ఈ నిర్ణయాల ద్వారా.. బెల్టుషాపులకు చెక్ పెట్టినట్టే అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీపై ధర పెంచి అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఇకపై వినిపించే అవకాశం లేదు. ఒకసారి దొరికితే రూ.5లక్షల జరిమానా విధించడం మాత్రమే కాదు.. రెండోసారి ఇదే తప్పు జరిగితే.. ఏకంగా లైసెన్సు రద్దు అయ్యేలా చట్టం చేయడం అనేది.. ఖచ్చితంగా దుకాణదారుల్లో మార్పు తెస్తుందని అంతా అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories