వంశీని వదిలేసి పోసానిని ఎత్తుకున్నారు!

జగన్మోహన్ రెడ్డి అనుకూల ప్రచారాలతో చెలరేగిపోతూ ఉండే ఆయన కరపత్రిక, చానెళ్లు వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నాయా? ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసింది, ఎందుకు అరెస్టు చేసింది అనే సంగతి వారికి అప్రస్తుతం. కాకపోతే.. ఏ సాకు చూపి.. ప్రభుత్వం మీద బురద చల్లితే ప్రజలు నమ్ముతారు! ప్రజల దృష్టి మళ్లించడం ఎలాగ.. వక్రప్రచారాలు ఏ కోణంలో చేస్తే బాగా రాజకీయ లాభం జరుగుతుంది.. అనేది మాత్రమే వారికి ప్రాతిపదికగా మారినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పత్రిక, చానెళ్లు ఇస్తున్న కవరేజీ గమనిస్తే అదే అనుమానాలు ఎవ్వరికైనా కలుగుతాయి. ఎందుకంటే.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ మీద బిగుస్తున్న కేసుల వ్యవహారాన్ని వారు పక్కన పెట్టేశారు.. పోసాని కృష్ణ మురళిని ప్రభుత్వం వేధిస్తున్నదనే అంశాన్ని మాత్రమే నెత్తికెత్తుకుని ఊరేగుతున్నారు.

ఇటీవలి కాలంలో జరిగిన వైసీపీ వారి అరెస్టులలో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ల అరెస్టులు ముఖ్యమైనవి. దళితుడిని కిడ్నాపుచేసి, నిర్బంధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించినందుకు వంశీ అరెస్టు అయ్యారు. నోటిదురుసుతో అసభ్యపు నీచ విమర్శలు చేసినందుకు పోసాని అరెస్టు అయ్యారు. ఈ రెండు కేసుల్లోనూ వీరు అడ్డంగా బుక్కయిపోయినట్టే. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డి కరపత్రిక, చానెళ్లలో పోసానికి మాత్రమే ఎక్కువ ప్రచారం లభిస్తోంది. ఇది వ్యూహాత్మకం అని అందరూ అంటున్నారు.

వంశీ వల్ల పార్టీకి నష్టం జరిగిందే తప్ప లాభం లేదని పలువురి అంచనా. ఎందుకంటే.. వంశీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు ప్రజల్లో చాలా సానుభూతిని కలిగించాయి. వంశీ వ్యాఖ్యల్ని జగన్ అప్పట్లో ఎంజాయ్ చేసిన తీరు కూడా ఆ పార్టీకి నష్టం చేసింది. ఇప్పుడు ఇలాంటి దళితుడి కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యాక జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన వ్యాఖ్యలు కూడా జగన్ పరువు తీశాయి. ఆయన మీద కొత్త కేసులు నమోదు అయినా.. ఆయనను వెనకేసుకు రావడం వల్ల ప్రయోజనం లేదని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
అదే సమయంలో పోసాని అరెస్టు జరిగింది. ఇది అసభ్య దూషణల వ్యవహారం మాత్రమే. పైగా పోసాని నటుడిగా రాష్ట్రవ్యాప్త పాపులారిటీ ఉన్నవాడు. రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్లకు విచారణ నిమిత్తం తిరిగే సమయంలోనూ మీడియా కెమెరాలు కనిపిస్తే హావభావ ప్రకటనలతో రంజింపజేసేవాడు. పైగా వృద్ధుడు. ఆయనను ప్రభుత్వం వేధిస్తున్నట్టుగా రంగు పులిమితే.. పార్టీకి ప్రజల్లో సానుభూతి దక్కుతుందని జగన్ దళాలు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాయి. వంశీ అరెస్టు సంగతి వెనక్కి వెళ్లింది. ఇప్పుడంతా.. పోసాని కోసం ఆక్రోశించడమే పెరిగింది.ఇదంతా కూడా  పోసాని మీద ప్రేమ కాదని.. రాజకీయ లాభం కోసం నాటకాలు అని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories