అధికారం కోల్పోయినా సరే ఆత్మస్థైర్యం సడలిపోని నాయకులు చాల మంది ఉంటారు. రాజకీయం అన్న తరువాత.. గెలుపు ఓటములు సర్వసాధారణం అనే జీవనసూత్రం తెలిసిన వారూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఒక్క చాన్స్ అంటూ దక్కించుకున్న అధికారం తనకు శాశ్వతం అని భావించినట్లున్నారు. ఇంకో ముప్ఫయ్యేళ్లు సీఎం కుర్చీలోనే ఉండాలని కలలు కన్న ఈ మాజీ ముఖ్యమంత్రి ప్రజలు తనను అత్యంత దారుణంగా ఓడించేసరికి ఇప్పుడు కుతకుతలాడిపోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి తాజాగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలతో ఒక సమావేశం నిర్వహించారు. శాసనమండలిలో తమ పార్టీ తరఫున పోరాడాల్సిన తీరును వారికి ఉపదేశించారు. సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీరు కీలక పాత్ర పోషించాలి అని అంటున్నారు.
ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే.. శాసనసభలో మనం ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ.. మనకున్న సంఖ్యాబలాన్ని బట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారనే నమ్మకం లేదు.. అని జగన్మోహన్ రెడ్డి పాపం తన ఎమ్మెల్సీలతో వాపోతున్నారు. ఆ సభలో గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. మనల్ని గొంతు విప్పనివ్వకపోవచ్చు.. అని అంటున్నారు. శాసనసభలో ఏదైనా పార్టీకి ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నా కూడా.. నిజమైన ప్రజాసమస్యలను ప్రస్తావించడానికి అడ్డంకి ఏమీ ఉండదు. కానీ జగన్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప, సభలో తాము మాట్లాడడానికి ఏమీ ఉండదు అని అర్థం వచ్చేలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా తద్వారా తనకు కేబినెట్ ర్యాంకు హోదా కావాలని ఆయన పరితపించి పోతున్నట్టుగా ఉంది.
తమకు ఆ హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కదు జగన్.. డౌట్ ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి రాష్ట్రంలోని ప్రజలందరూ సంపూర్ణమైన విశ్వాసంతో చంద్రబాబుకు అధికారం కట్టబెట్టిన తర్వాత.. ప్రధాన ప్రతిపక్ష హోదా కు కూడా జగన్ పనికిరాడని నిర్ణయించిన తర్వాత.. ఆయన ఇంకా దాని మీద ఎలా ఆశలు పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. జగన్ కు నిజంగానే ప్రజల గురించి చిత్తశుద్ధి ఉంటే.. ప్రతపక్ష హోదా కావాలని అనుచితమైన ఆశలు పెట్టుకోకుండా.. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోవాలని ప్రజలు హితవు చెబుతున్నారు.