రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ దళాలకు మనశ్శాంతి దక్కేలా లేదు. ఏదో ఒక చిచ్చు పెట్టి.. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారిస్తే తప్ప వారు చల్లబడేలా లేరు. రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉంది. ప్రస్తుతం పంట దిగుబడి వచ్చి విక్రయించే సీజను నడుస్తోంది. మార్కెట్లో క్వింటాలుకు గరిష్టంగా రూ.13 వేలు మాత్రమే ధర పలుకుతోంది. ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు అయ్యే ధర కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా అంటున్నారు. సహజంగానే ఈ పరిస్థితిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నది. ప్రభుత్వం మీద బురద చల్లడానికి వారు నానా పాట్లు పడుతున్నారు. వారి సొంత మీడియా చానెళ్లలో ప్రత్యేక బులెటిన్లు మిర్చి పంట గురించే నడుపుతున్నారు. మంచిదే. అయితే వారు రైతు ఆవేదనను, నష్టాన్ని ప్రెజంట్ చేయడానికి పరిమితం కాకుండా.. ఈ పరిస్థితుల్లో మిర్చి రైతులకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు.. అంటూ తమ చానెల్‌లో రెచ్చిపోతున్నారు.
ఇదేంతరహా కవరేజీ! రైతులు నష్టాల్లో ఉండవచ్చు గాక.. రైతులకు ఏర్పడిన నష్టాలన్నింటికీ చంద్రబాబునాయుడును బాధ్యుడును చేసేసి.. ఆయనను బద్నాం చేయాలని వైఎస్సార్ సీపీ వారికి, ఆయన సొంత చానెల్ వారికి కోరిక మెండుగా ఉండవచ్చు గాక.. అంతమాత్రాన.. ఆ మాటలు చెబితే సరిపోతుంది కదా! ‘రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే’అంటూ వారిని చావుల వైపు ప్రేరేపించడం ఏమిటి? ఈ దుర్మార్గాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు.
గత ఏడాది అంతకు ముందు ఏడాది కూడా మిర్చి ధర బాగానే పలికింది. రైతులు వేలం వెర్రిగా అనూహ్యమైన విస్తీర్ణంలో ఈసారి మిర్చి సాగు చేశారు. ఆటోమేటిగ్గా ధర పడిపోయింది. గత ఏడాది పండిన పంట నిల్వలే ఇంకా కోల్డ్ స్టోరేజీల్లో నిండుగా ఉన్నాయి. ఆ అంచనా కూడా లేకుండా.. రైతులు భారీగా వేయడం వలన మిర్చికి ధర పలకడం లేదు. కేంద్రం మద్దతు ధర ప్రకటించని వ్యాపార పంటల్లో మిర్చి కూడా ఒకటి. ఈ ధర పూర్తిగా మార్కెట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అలాంటిది.. మిర్చి ధర పలకలేదు గనుక.. ప్రభుత్వాన్ని నిందించడం అనేది అర్థం పర్థం లేని వ్యవహారం అనిపించుకుంటుంది. రైతులు నష్టపోతున్నారు గనుక.. మహా అయితే.. ప్రభుత్వం దయతలచి క్వింటాలుకు కొంత సాయం అందించాలని అడగడం మంచిదే.
కానీ.. అటూ ఇటూ కాకుండా.. రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే వేరే మార్గం లేదు. అంటూ రైతులను చావుల వైపు ప్రోత్సహించేలా వైసీపీ మీడియా దళాలు తప్పుడు ప్రచారాలు చేయడం ఘోరం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మిర్చి రైతులకు మార్కెట్ హెచ్చుతగ్గులు అలవాటే అని, 2019లో క్వింటాలు 8వేలు మాత్రమే ధర పలికిందని.. రైతులు పరిస్థితుల్ని తట్టుకుని నిలబడి.. తర్వాతి సంవత్సరాల్లో ధర వచ్చాక కుదురుకున్నారని ప్రజలు గుర్తుచేస్తున్నారు.