రాజకీయాల్లో ఎన్నికల్లో విజయం సాధించేంత ప్రజాదరణ లేకపోయినా సరే.. ఎంతో కొంత గౌరవప్రదమైన గుర్తింపు ఉండే పార్టీలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి పార్టీల్లో సీపీఐ, సీపీఎం ముఖ్యమైనవి. వీరు నిత్యం ప్రజాపోరాటాల ద్వారా తమ గుర్తింపు కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి పార్టీలు కూడా.. కుటిల రాజకీయ నీతులు పాటిస్తూ.. ఎలాంటి బాధ్యతలేని ప్రకటనలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అప్పుడప్పుడూ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక రాజకీయ ప్రకటన చేయకుండా, అధికారంలో ఉన్న వారిని నిందించకుండా ఉంటే.. ప్రజలు తమను పూర్తిగా మరచిపోతారేమో అనే భయం వారిని వెన్నాడుతున్నట్టుగా అనిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తాజా మాటలను గమనిస్తే.. మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తే చాలు.. దానిని కడుక్కోవడం అవతలి వారి ఖర్మ అనే వక్రనీతిని అనుసరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
కేంద్రంలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చిన రామకృష్ణ ఆ బిల్లు నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారును, బిల్లుకు మద్దతిచ్చిన అన్ని పార్టీలను విమర్శించడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కూడా, నారా చంద్రబాబునాయుడుపై కూడా నిప్పులు చెరగడానికి ప్రయత్నించారు.
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా చంద్రబాబు ఎవరూ గమనించడం లేదు అనుకుంటూ విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని సిపిఐ రామక్రిష్ణ అంటున్నారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశాడని ఆరోపించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు చేస్తున్న పని కూడా అదేనని, పదినెలల్లో ప్రభుత్వ ట్రాక్ రికార్డు ఏంటో చెప్పాలని అంటున్నారు. అమరావతి కోసం చేస్తున్న అప్పులన్నింటినీ భూతద్దంలో చూపిస్తూ.. కేంద్రం గ్రాంట్ ఇస్తుందని చెప్పారని, గ్రాంట్ ఎక్కడ ఇచ్చిందో చూపించాలని ఆయన యాగీ చేస్తున్నారు.
అయినా జగన్ చేసిన అప్పులకి- చంద్రబాబు చేస్తున్న అప్పులకు పోలిక పెట్టడం రామక్రిష్ణ తప్ప మరెవ్వరూ చేయలేరనేది ప్రజల మాటగా ఉంది. ఎందుకంటే.. జగన్ కాలంలో నిర్మాణాత్మకంగా జరిగిన పని ఒక్కటీ రాష్ట్రంలో ఇవాళ కళ్ల ముందు లేదు. చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత ఎన్ని పనులు జరుగుతున్నాయో కూడా అందరికీ కనిపిస్తోంది.
పైగా అమరావతికి చేస్తున్న అప్పుల గురించి.. రామక్రిష్ణ ఆవేదన చెందడం, కేంద్రం గ్రాంటు ఇవ్వలేదనడం మొసలి కన్నీరుగా ప్రజలు అంటున్నారు. అమరావతి సెల్ఫ్ సస్టయినబుల్ర ప్రాజెక్టు అని, రాజధాని కోసం చేసే అప్పులన్నిటినీ అమరావతేతీర్చుకోగలదని మంత్రి నారాయణ స్పష్టంగా ప్రకటించినతర్వాత కూడా.. ఇలాంటి కుటిల విమర్శలు తగవని ప్రజలు అంటున్నారు.