జోగి రమేష్ తెదేపాలో చేరుతున్న సంకేతాలే ఇవి.

సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మనవరాలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గౌత శిరీష పాల్గొనడం విశేషం కాదు. అలాగే స్థానిక నాయకుడు తెలుగుదేశానికి చెందిన మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొనడం కూడా విశేషం కాదు. అధికార పార్టీ వారే నిర్వహించిన కార్యక్రమం కనుక కచ్చితంగా వాళ్ళు ఆ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు చాలా పెద్ద వివాదంగా మారుతోంది. కార్యక్రమానికి ఆయన కూడా అతిథిగా వచ్చారు కనుక మంత్రి పార్థసారథి, గౌత శిరీష ఆయనతో మాట్లాడారు వేదికను పంచుకున్నారు. ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ప్రధానంగా పచ్చ మీడియా వారు సహించలేకపోతున్నారు.

చంద్రబాబునాయుడు ఇంటి మీద దాడి చేసిన నాయకుడితో కలిసి వేదికను పంచుకుంటారా? కలిసి ఊరేగింపులో పాల్గొంటారా? అంటూ ఎడాపెడా విరుచుకు పడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ వారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు జోగి రమేష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లు కదా నిందించాల్సింది. అసలు ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లావని ఆయనను ఆ పార్టీ అధిష్టానం సంజాయిషి అడగాలి కదా? అలా జరగడం లేదు.

చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన కేసులో నిందితుడైన జోగి రమేష్ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరవచ్చు అనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతూ ఉంది. కేవలం ఈ ఒక్క కేసు మాత్రమే కాకుండా కేసులో ఇరుక్కున్న తర్వాత తన గురించి వైసీపీ పట్టించుకోవడం లేదని.. కాబట్టి తెలుగుదేశంలో చేరడం మేలని ఆయన భావించినట్లు సమాచారం. ఆ ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత సూత్రప్రాయంగా ఓకే చెప్పినప్పటికీ ఇతరత్రా పరిస్థితులను అంచనా వేయడం కోసం మాత్రమే ఇంకా చేరిక జరగలేదు అనేది రాజకీయ వర్గాల సమాచారం.

ఈలోగా గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ వివాదం తెరమీదకు వచ్చింది. దీని ద్వారా బహుశా తెలుగుదేశం అధిష్టానానికి పార్టీ కార్యకర్తలు జోగి రమేష్ కు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలు వెళ్ళవచ్చు. ఆయనను చేర్చుకుంటే పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వారికి ఏర్పడవచ్చు. ఆయనను చేర్చుకునే విషయంలో ఇంకొన్నాళ్ళపాటు వేచి చూసే ధోరణిని అవలంబించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories