జగన్మోహన్ రెడ్డి ప్రజలు నవ్విపోతారనే అనుమానం, మొహమాటం కూడా లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యాఖ్యలు ఎంత చవకబారుగా ఉంటాయంటే.. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారట. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదట. ప్రజల నిరసనలను దారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ టెక్నిక్ పాటిస్తూ.. ఆయన తిరుమల లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వివాదాన్ని తెరమీదికి తెచ్చారట. .. జగన్ విమర్శలు ఇలా ఉంటాయి. ఎక్కడైతే తమ పాపాలు బయటపడుతూ ఉంటాయో.. అప్పుడు అవి ప్రభుత్వం పాల్పడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయన అంటారు. కానీ ఆయన వ్యవహార సరళిలోనే ఇప్పుడు అసలైన డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం చేస్తున్న వరద సాయం విషయంలో బురద చల్లడానికి సాహసించారు. ఆయన దళాలు ఎక్కడినుంచి లెక్కలను సేకరించాయో తెలియదు గానీ.. కేవలం భోజనాలు, ఆహారం సరఫరాకు 534 కోట్ల రూపాయలు, నీళ్ల సదుపాయం కోసం 26 కోట్ల రూపాయలు, కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు వరదబాధితులకు పంచినందుకు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఒక భారీ ప్రచారం ప్రారంభించారు. ఆ అబద్ధాలను వ్యాప్తిలో పెట్టేసి.. వందల కోట్లు తెదేపా వారు కాజేసినట్టుగా మాట్లాడడం ప్రారంభించారు. జగన్ అనుకూల మీడియా, ఆయన కరపత్రిక మొత్తం ఇవే కథనాలతో నిండిపోయాయి.
చానెళ్లలో ఈ దోపిడీ మీద మాత్రమే గంటలకొద్దీ చర్చలు నడిచాయి. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే ఆ బురద ప్రచారానికి తెరపడిపోయింది. ప్రజలకు వాస్తవాలు తెలిశాయి. జగన్ దళం కుట్ర కూడా తెలిసింది. ప్రభుత్వంలోని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి మరీ..అసలు ఖర్చుల వివరాలు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వరదసాయం అంతా కలిపి 601 కోట్లు ఖర్చు పెడితే.. భోజనాల పేరిట 534 కోట్లు అని సాగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యేసరికి.. జగన్ కరపత్రిక మీడియా.. కన్వీనియెంట్ గా కొత్త ఎత్తుగడ వేసింది. జగన్మోహన్ రెడ్డి వరద దోపిడీ అస్త్రం బూమరాంగ్ అయి తన పరువే తీసేస్తుండేసరికి సరికొత్త డైవర్షన్ పాలిటిక్స్ బాట తొక్కారు.
ఇప్పుడు ఆయన హర్యానా ఎలక్షన్ రిజల్ట్ మీద అనుమానాలు రేకెత్తించడం ద్వారా.. తన కుటిల యత్నాలను అసహ్యించుకునే ప్రజల ఆలోచనను దారి మళ్లించవచ్చునని అనుకుంటున్నారు. హర్యానాలో ఈవీఎంల మానిప్యులేషన్ ద్వారా బిజెపి గెలిచినట్టుగా ప్రచారం చేయడానికి జగన్ ఉత్సాహపడుతున్నారు. ఏపీలో కూడా అలాగే గెలిచారని అంటున్నారు. నిన్నటిదాకా నిత్యం ఢిల్లీ పెద్దల ఎదుట సాగిలపడుతూ.. వారి గుడ్ లుక్స్ లో ఉండడానికి తపన పడిపోయిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు బిజెపి ఈగోను టచ్ చేశారు. మరి దీని పర్యవసానాలు ఇబ్బంది కరంగా మారి.. హర్యానా ఫలితాలపై చేసిన ట్వీట్ కూడా బూమరాంగ్ అయితే.. అసలు జగన్ ఏమైపోతారోనని, కొత్తగా డైవర్ట్ చేయడానికి ఏ టాపిక్ ఎంచుకుంటారో అని ప్రజలు నవ్వుకుంటున్నారు.