‘‘కారే రాజులు? రాజ్యముల్ కలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?’’ వామనావతారఘట్టంలో పోతన రాసిన పద్యం ఇది. రాజులైనంత మాత్రాన, సంపదలు, భూములు కలిగి ఉన్నంత మాత్రాన మూటగట్టుకుని పోయేదేం ఉండదు. ఆశను ఎవ్వరూ చంపుకోలేరు గానీ.. ‘మూటగట్టుకు పోయేదేముంది..’ అంటూ అనేక సందర్భాల్లో సన్నాయి నొక్కులు నొక్కేవాళ్లు చాలా మందే ఉంటారు. ఏమీ ఉండదు సరే.. కానీ.. మిగలబెట్టింది కూడా.. అచ్చంగా వారసులు ఎవ్వరూ లేకుండా, అలా చెప్పుకునే ఎవ్వరికీ దక్కకుండా ప్రభుత్వం పాలైపోవడం మాత్రం చిత్రమైన సంగతే. తమిళనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి.. పురట్చితలైవిగా అభిమానులతో పిలిపించుకున్న జయలలిత ఆస్తుల పరిస్థితి ఇదే! తాను పదవిలో ఉండగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న జయలలిత సంపదలు మొత్తం ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికే చెందేలాగా హైకోర్టు తీర్పు చెప్పింది. మొత్తంగా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తులు తమిళ నాడు ప్రభుత్వానికి చెందనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అసలు జయలలిత ఆస్తుల చిట్టా చూస్తే ఎవ్వరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. జయలలితకు సంబంధించి 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, పదివేలకు పైగా చీరలు, 750 జతలకు పైగా చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. జయలలిత పదవిలో ఉండగా ఎంతగా అవినీతికి పాల్పడ్డారో ఒక అంచనాకు రావడానికి ఇవి ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపి దశాబ్దం కిందట స్వాధీనం చేసుకున్నప్పుడు రూ.913 కోట్లు అని అంచనా వేశారు గానీ.. ఇప్పుడు వాటన్నింటి మార్కెట్ విలువ రూ.4000 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
జయలలిత మీద అనేక అవినీతి ఆరోపణలున్నాయి. జయలలితతో సమానంగా ఆమె నెచ్చెలి శశికళ కూడా ఆస్తులు సంపాదించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత.. కొంత రాజకీయ హడావుడి చేసినప్పటికీ.. శశికళ ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారు. ఆమె పేరిటగానీ, ఆమె బినామీల పేరిట గానీ ఎన్ని వేల కోట్లు ఉన్నాయనే సంగతి లెక్కతెలియదు.
ఎంత అవినీతి చేసి మాత్రం ఏం సాధించారు? వేలకు వేల కోట్లు ప్రజాధనాన్ని దారి మళ్లించి, అవినీతి చేసి కూడబెట్టారు గానీ.. అదంతా ఇప్పుడు ప్రజలకే చెందబోతోంది. ఇది ప్రకృతి చెబుతున్న న్యాయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.