కేవలం తమ రాజకీయ ప్రత్యర్థిని దోషిగా ప్రజల ముందు నిలబెట్టడం కోసం.. కేవలం తమ వక్ర రాజకీయ అనుచిత ప్రయోజనాల కోసం పదులసంఖ్యలో ముసలివాళ్ల ప్రాణాలను బలితీసుకున్న ప్రభుత్వం ఇది! వృద్ధులకు వికలాంగులకు ఇళ్ల వద్దనే పెన్షను అందజేయడానికి తగిన మానవవనరుల లభ్యత క్షేత్రస్థాయి వరకు పుష్కలంగానే ఉన్నప్పటికీ కూడా.. వినియోగించుకుండా.. వారిని రోడ్ల పాల్జేసి వారి ఉసురుపోసుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మే నెల వస్తోంది. ఇంకా సమయం ఉంది. కనీసం ఇప్పుడైనా.. వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు లబ్ధిదారులు అందరికీ ఇళ్ల వద్దకే పెన్షను అందేలా.. ఒకటో తేదీ దాటి జాప్యం జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం కుట్రలను ఏప్రిల్ పింఛన్ల పంపిణీ సమయంలో గమనించిన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కూడా అదే విషయంలో ఆందోళన చెందుతున్నారు.
వాలంటీర్ల ద్వారా పెన్షను లబ్ధిదారులను ప్రలోభ పెట్టి వారిని మాయచేసి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలని అధికార పార్టీ అనేక కుట్ర రచనలు చేసింది. ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. వాలంటీర్లతో సమావేశాలు పెట్టుకుని వారికి తాయిలాలు ఇచ్చి, భారీ నగదు కానుకలు ఇచ్చి ముందు వారిని ప్రలోభపెట్టడం ద్వారా లబ్ధిపొందాలని వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులంతా కూడా వ్యూహాలు చేశారు. కానీ.. సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ వారి ఫిర్యాదుతో ఈసీ జోక్యం చేసుకోవడం.. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి ఈ రెండునెలల పాటు దూరంగా ఉంచాలని ఆదేశించడంతో వారి కుట్రలకు బ్రేక్ పడింది.
ఈసీ ఆదేశాలు వచ్చిన వెంటనే.. గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా.. లబ్ధిదారులు అందరికీ ఇళ్లవద్దకే పింఛన్లు పంపే ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబునాయుడు ఈసీకి, సీఎస్ జవహర్ రెడ్డికి లేఖలు కూడా రాశారు. కానీ.. సీఎస్ వాటిని ఖాతరు చేయలేదు. అందరూ సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్లు తీసుకోవాలనేలా ఉత్తర్వులు జారీచేశారు. ఒకవైపు మండే ఎండలు, వృద్ధులందరినీ రమ్మనడంతో పలువురు చనిపోయారు కూడా. ఈ చావులన్నింటినీ చంద్రబాబు ఖాతాలో వేసేసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ అనుకున్నది. కానీ అచ్చంగా అది ప్రభుత్వ వైఫల్యమే అనే సంగతి ప్రజల్లోకి వెళ్లింది.
ఇప్పుడు మేనెల వస్తున్న సమయంలో.. ఇంకా సమయం ఉంది. ప్రజల ప్రాణాలు బలితీసుకోకుండా ప్రభుత్వం ఇళ్లవద్దకే పింఛన్లు అందించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. చంద్రబాబునాయుడు కూడా ఈ మేరకు ముందుగానే ఎన్నికల సంఘానికి చొరవ తీసుకోవాల్సిందిగా లేఖ రాశారు. మరి సీఎస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏర్పాట్లు చేస్తారో చూడాలి.