రెండురోజులుగా రాజకీయవర్గాల్లో అత్యంత హాట్ టాపిక్ ఒకటి చెలామణీ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన చెల్లెలు- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిలకు మధ్య ఒక ఒప్పందం కుదిరిందన్నదే ఆ హాట్ టాపిక్. 2019 ఎన్నికలు పూర్తయినప్పటినుంచి అన్నా చెల్లెళ్ల మధ్య సంబంధాలు సవ్యంగా లేవనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్ మీద షర్మిల సందర్భం దొరికితే చాలు.. కత్తులు నూరుతున్నారు. కాకపోతే..ఓటమి తరువాత వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి షర్మిలకు ఆస్తుల్లో వాటాలు పంచి ఇవ్వడానికి ఒప్పుకున్నారని, ఆస్తులను ఎలా పంచుకోవాలనే విషయంలో సూత్రప్రాయంగా ఒక అంగీకారం కుదిరిందని అంటున్నారు. ఇప్పుడు చెల్లెలిని ప్రసన్నం చేసుకుని, ఆమె ద్వారా కాంగ్రెసు పార్టీతో స్నేహం కుదుర్చుకోవాలని జగన్ ఆశపడుతున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఇప్పటికి డజను సార్లకు పైగా బెంగుళూరు వెళ్లారు. ప్రతిసారీ ఆయన అక్కడి అత్యంత విలాసవంతమైన ఆయన యలహంక ప్యాలెస్ లో గడపడానికే వెళుతున్నారేమోనని అంతా అనుకున్నారు. కానీ.. ఇన్ని సార్లు వరుస పర్యటనలు సాగడం వెనుక అసలు సీక్రెట్ వేరే ఉన్నదని తాజాగా ఒక పత్రిక కథనాల్ని అందించింది. చెల్లెలితో రాయబారం నడపడానికే ఆయన ఇన్నిసార్లు వెళ్లారని పేర్కొంది. జగన్ పట్ల సానుభూతితో కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇందులో జోక్యం చేసుకున్నట్టు, అన్నా చెల్లెళ్ల మధ్య రాజీ కుదుర్చినట్టు సమాచారం.
వారిద్దరి మధ్య 2019 ఎన్నికలు పూర్తయినప్పటినుంచి తగాదాలు ఉన్నాయి. ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం దక్కిన ఆస్తులను పంచుకోవడంలో తగాదాలే అని సమాచారం. షర్మిల అలిగి అన్నయ్యను పూర్తిగా వదిలేసి తెలంగాణ వెళ్లిపోయి అక్కడ పార్టీ పెట్టుకున్నారు. అది ఫ్లాప్ అయింది. దానిని కాంగ్రెసులో విలీనం చేసి ఏపీ కాంగ్రెసు సారథ్యం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఆమె సాధించిన ఓటు శాతం తక్కువే గానీ.. జగన్ కు నష్టం చేయడంలో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు. బాబాయి వివేకానందరెడ్డిని హత్యచేసిన వారిని కాపాడుతున్నారని అనడం దగ్గరినుంచి, ఆ హత్య వెనుక జగన్ హస్తం ఉన్నదని ప్రజలు అనుమానించే స్థాయికి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం ఓడిపోయిన తర్వాత జగన్ గత్యంతరం లేని స్థితిలో ఉన్నారు. తన మీద ఉన్న సీబీఐ, ఈడీ కేసుల నుంచి రక్షణ కావాలంటే.. ఏదో ఒక జాతీయ పార్టీ జట్టులో ఉండడం అవసరం అని ఆయన భావన. బిజెపితో దోస్దీకి ప్రయత్నించారు గానీ.. వారు చంద్రబాబును జట్టులో చేర్చుకున్నారు. ఇక కాంగ్రెసు జట్టులో చేరాలంటే.. షర్మిల పొసగనివ్వడం లేదని, అందువల్ల ఆస్తుల పంపకానికి ఒప్పుకుని, చెల్లెలిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని పలువురు అంటున్నారు.