అమరావతి రాజధానిని ప్రపంచంలోనే ఓ అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేలా అమరావతి రాజధానిని నిర్మిస్తా అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. అయితే రాజకీయ సైంధవులు మాత్రం అమరావతి కోసం జరుగుతున్న భారీ ఆలోచనలను తప్పుపడుతూ, ప్రజల్లో అపోహలు కలిగించడానికి ప్రయత్నిస్తూ, కిరాయి ఏడుపులతో తమ కుటిలత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు సీపీఐ రామకృష్ణ.. అమరావతిలో రైల్వేస్టేషన్ ను 1500 ఎకరాల్లో నిర్మిస్తాం అంటున్న ప్రభుత్వపు మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇంతపెద్ద రైల్వేస్టేషన్ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సైంధవులకు ప్రజలు వేస్తున్న ప్రశ్న ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడా లేకపోతే.. అమరావతిలో ప్లాన్ చేయడం నేరం అవుతుందా?
మామూలుగా అమరావతి రాజధాని మీద కక్ష కట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు.. ఆ నగర నిర్మాణం దిశగా జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా తప్పుపడుతున్నాయి. లోపాలు ఎన్నుతున్నాయి. ప్రజల్లో భయాలు పుట్టించాలనుకుంటున్నాయి. పనిలో పనిగా ప్రతి విషయం మీద తామే మాట్లాడడం కాకుండా.. వేరేవాళ్లతో కూడా కిరాయి విమర్శలు చేయించడం, కిరాయి కేసులు వేయించడం వైసీపీకి అలవాటు.
ఇటీవల వడ్డే శోభనాద్రీశ్వరరావు.. 1500 ఎకరాలు రైల్వేస్టేషన్ కు ఎందుకు అంటూ ఒక పాట ప్రారంభించారు. ఇప్పుడు సీపీఐ రామక్రిష్ణ అదే పాట అందుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇంతపెద్ద రైల్వేస్టేషన్ ఉందా అంటున్నారు. అయితే ఇక్కడ చాలా విషయాలు గమనించాల్సి ఉంది. ఉదాహరణకు సికింద్రాబాదును తీసుకుంటే రైల్వేస్టేషను అనేది పరిమితమైన విస్తీర్ణంలోనే ఉండవచ్చు గాక.. కానీ.. సికింద్రాబాద్ వ్యాప్తంగా రైల్వేకు సంబంధించిన అన్ని రకాల కార్యాలయాలు, వర్క్ షాపులు, ఇలాంటివి అనేకం ఉంటాయి. అలాంటి అన్ని ఏర్పాట్లు ఉన్న చోట వందల ఎకరాలు కూడా చాలదు. నిజానికి చంద్రబాబునాయుడు విజన్ లో కూడా అమరావతిని కూడా రైల్వే పరంగా దక్షిణాదికి కేంద్రబిందువుగా నిలపాలనే ఆలోచన ఉండవచ్చు. రైల్వేపరంగా ఎన్ని రకాల కార్యాలయాలు, వర్క్ షాపులు తదితర వ్యవహారాలను మనసులో ఉంచుకుని అన్నింటికీ కలిపి 1500 ఎకరాలు అనేది పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. కానీ.. వైసీపీ దళాలు, సీపీఐ రామకృష్ణ వంటి వారు సైంధవుల్లాగా ఇప్పటినుంచి అడ్డుపుల్లలు వేయడం అనేది.. ప్రగతిశీల ఆలోచనలను అడ్డుకోవడమే అవుతుంది. అమరావతి విశాలస్వరూపాన్ని అర్థం చేసుకోకుండా వారి కుటిలత్వం అవుతుంది.