జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ను ఆర్థికంగా బలపడడానికి వాడుకోవాలని అనుకున్నారు. అధికారం దొరికిందే తడవుగా ఎన్ని రకాల అక్రమాలు చేయవచ్చునో ఆలోచన చేశారు. వాటి ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా పేదలందరినీ నిలువు దోపిడీ చేయడానికి అనువైన కొత్త మద్యం విధానం రూపొందింది. కొత్త ఇసుక విధానం రూపొందింది. ఆ ముసుగులో కనీసం డిజిటల్ పేమెంట్లను కూడా అనుమతించకుండా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకోవడం ఒక నిత్యకృత్యంగా మారింది.
జగన్ మార్పు లిక్కర్ పాలసీలో మద్యం ప్రియులు ఇష్టంగా తాగే ఏ బ్రాండ్ కూడా అందుబాటులో లేకుండా చేశారు. మద్యం తయారీ వ్యాపారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బినామీ పేర్లతో హస్తగతం చేసుకున్నారు. ప్రముఖ బ్రాండ్లు ఏవీ అందుబాటులో లేకుండా.. కల్తీ, నకిలీ, ఊరూపేరూ తెలియని బ్రాండ్లు మాత్రమే ఏపీలో అందుబాటులో ఉంచారు. వాటికి కూడా అపరిమితమైన ధరలు పెట్టారు. పర్యవసానంగా ప్రజలు ఆర్థికంగా గుల్లయిపోవడం మాత్రమే కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా సర్వనాశనం అవుతూ వచ్చింది.
మద్యం వ్యాపారాల రూపేణా వేలకు వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గాల్లో దండుకోవడం తప్ప ప్రజల క్షేమం, ఆరోగ్యం ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు. రాష్ట్రంలో ఆయన పరిపాలన సాగిన కాలంలో.. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా మద్యం ప్రియులు విచ్చలవిడిగా ఆయనను తిట్టుకుంటూ ఉండే వాతావరణం కనిపించేది. సంక్షేమ పథకాల ముసుగులో ప్రతి కుటుంబానికి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి.. మద్యం వ్యాపారం రూపంలో నిరుపేదల్ని కొల్లగొట్టేస్తున్నారనే విమర్శలు గతంలో చాలా వచ్చాయి.
ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్టే. మద్య ప్రియులకు నచ్చే అన్ని ప్రముఖ బ్రాండ్లను కూడా రాష్ట్రంలోని మద్యం దుకాణాలలో ఇకపై అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. ఇప్పుడు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేస్తున్నారు. కల్తీ బ్రాండ్లనుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం అంటున్నారు. త్వరలోనే కొత్త మద్యం పాలసీకి సంబంధించి ప్రస్తుతం సర్కారు కసరత్తు చేస్తోంది. జగన్ సర్కారు మద్యం పాలసీ ముసుగులో సాగించిన అక్రమాలన్నీ త్వరలోనే బయటపెడతాం అని కూడా మంత్రి చెబుతుండడం విశేషం.
దుకాణాల వద్ద తిట్టుకుంటూ మద్యం కొనుగోలు చేసే వాతావరణం ఇకపై ఉండదు. అలాగే నకిలీల బారిన కల్తీ మద్యం బారిన పడకుండా ఆరోగ్యాలను కూడా కాపాడుకునే వాతావరణం ఏర్పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు.