తమ డిమాండుకు తలాతోకా లేదు సార్లూ!

గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్ముకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఇష్టానుసారంగా చెలరేగిపోవచ్చునని అనుకుంటున్నట్టుగా శాసనమండలిలో పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక పని చేస్తోంది. అసలు ఆ వ్యవహారంతో సంబంధమే లేకుండా.. ఏదో జరిగిపోతున్నట్టుగా ప్రతిపక్షం ప్రచారం ప్రారంభించింది. వాస్తవాలను స్వయంగా గమనించి తెలుసుకునే తెలివితేటలు ప్రజలకు ఉన్నాయి కదా అనే భయం వారికి లేదు. వెరపు లేదు. తమ దుష్ప్రచారాలను చూసి నవ్వుతారనే జంకు కూడా లేదు. అబద్ధాలను అదే పనిగా ప్రచారం చేస్తూ ఉంటే, ప్రజలు దానిని నమ్ముతారని ఒక అపోహ. అచ్చంగా ఒకప్పటి జర్మనీ నియంత వద్ద ప్రచారబాధ్యతలు చూసిన గోబెల్స్ సిద్దాంతం ఇది. నువ్వు అబద్ధాన్నే ప్రచారం చేయదలచుకోవచ్చు గాక.. కానీ పదేపదే అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉండు.. నీకు వీలైనంత ఎక్కువ మందితో అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉండు.. ప్రజలు దానిని నెమ్మదిగా నిజం అని అనుకోవడం ప్రారంభిస్తారు.. అనేది గోబెల్ సిద్ధాంతం. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళాలు అదే సిద్ధాంతం అవలంబిస్తున్నాయి.
నిజానికి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నట్టుగా జగన్ ప్రచారం చేసుకోవడానికి అతనికి నైతిక హక్కు లేనేలేదు. ఎందుకంటే.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనేది.. మోడీ సర్కారు ఒక విధాన నిర్ణయంగా తీసుకున్నది. ఆ మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూ వచ్చింది. వెనుకబడిన కొన్ని రాష్ట్రాలకు నూరుశాతం నిధులను కూడా కేంద్రమే సమకూరుస్తుంది. ఏపీ వంటి రాష్ట్రాలకు కొంత మేర నిధులు కేంద్రం నుంచి అందుతాయి. మోడీ సర్కారు రావడానికి ముందు దేశవ్యాప్తంగా 300 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 720కు పెరిగిందనేది ఒక అంచనా. కేంద్ర సర్కారు తమ విధాన నిర్ణయంగా అమలు చేస్తున్న వ్యవహారంలో భాగంగానే.. ఏపీలో కూడా మెడికల్ కాలేజీలు వచ్చాయి. జగన్ కేంద్రం నుంచి వచ్చినంత నిధులను వెచ్చించి.. తమ వారికి కాంట్రాక్టులు ఇచ్చుకుని ఎడ్మినిస్ట్రేటివ్ భవనాలు మాత్రం నిర్మించి.. మాయ చేశారు. తరగతి గదులు లేవు. లెక్చరర్ల నియామకాలు చేపట్టలేదు. ల్యాబ్ లు లేవు. కనీసం మెడికల్ కౌన్సిల్ సీట్లు కేటాయించిన కాలేజీల్లో కూడా లాబ్ లు వంటి సదుపాయాలు ఏర్పాటుచేయకుండా ద్రోహం చేశారు జగన్.

ఇదంతా పక్కన పెట్టినా.. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం వాటిని ప్రెవేటీకరించడం లేదు. పీపీపీ పద్ధతిలోకి మాత్రమే మారుస్తోంది. దీనివల్ల.. ప్రభుత్వానికి కూడా కాలేజీల మీద సమాన అధికారం ఉంటుంది. కానీ.. ‘ప్రెవేటీకరిస్తున్నారు’ అనే పదాన్ని మాత్రమే ప్రచారంలో పెట్టడానికి వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. శాసనమండలికి మాత్రం హాజరవుతున్న వైసీపీ సభ్యులు వాయిదాతీర్మానానికి నోటీసు ఇచ్చి అభాసుపాలయ్యారు. అక్కడకూడా ఇదే గొడవ. ప్రెవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం అని నినాదాలు. వారి పార్టీకే చెందిన మండలి అధ్యక్షుడు కూడా విసిగిపోయేలా.. వారు వ్యవహరిస్తున్నారు. పదేపదే ప్రెవేటీకరణ అనగానే.. ప్రజలు నమ్మేస్తారనేది వారి ఊహ. కానీ.. పీపీపీని అలా అభివర్ణించడం జగన్ దళాల అజ్ఞానం, కుట్ర మాత్రమే అని ప్రజలు గ్రహిస్తే వారి పరువు ఏమౌతుంది?

Related Posts

Comments

spot_img

Recent Stories