ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ నేతల్లో ఒకరు. ఎన్ టి రామారావుతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. చంద్రబాబునాయుడుతో కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. కానీ.. ఒకదఫా ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే.. స్వల్పకాలిక లాభాలను చూసుకుని వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీలో నియోజకవర్గాన్ని చూసుకోవడాన్ని మినహా పెద్దగా దక్కిన మర్యాద కూడా లేదు. పైగా స్థానిక విభేదాల కుంపటిలో కాలుతూ సతమతం కావడం ఒక్కటే మిగిలింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కుమారుడిని బరిలోకి దించితే పరాజయమే పలకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరణం బలరాం ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడు. రెండు మూడు నియోజకవర్గాలలో ఆయనకు మంచి పట్టు ఉందని అంతా అంటుంటారు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అలాంటి కరణం బలరాం కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. స్వల్పకాలిక లాభాలకు ఆశపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికలలో కరణం బలరాం చీరాల నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో.. ఆయన పార్టీ ఫిరాయించి వైసీపీ జట్టులో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్ అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనకు ఎన్నో వైభవమైన పదవులను కట్టబెట్టినప్పటికీ 2019 ఎన్నికలలో ఓడిపోగానే ఆయన పార్టీ మారిపోవడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సాంకేతికంగా అనర్హత వేటు ఇబ్బందులు రాకుండా ఉండడానికి తన కొడుకు కరణం వెంకటేష్ ను వైసీపీలో అధికారికంగా చేర్చారు. జగన్మోహన్ రెడ్డి వెంకటేష్ కు కండువా కప్పి ఆహ్వానించారు. కరణం బలరాం మాత్రం వైసిపి కండువా వేస్కోకుండా ఆ పార్టీ గొడుగు కింద మిగిలారు. కానీ చీరాల వైసిపి అంతర్గత రాజకీయాలు ఆయనను గందరగోళానికి గురిచేశాయి. అక్కడ వైసిపి ఇన్చార్జిగా అప్పటివరకు ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ వర్గంతో సఖ్యత కుదరలేదు. చీరాల వైసీపీలో రెండు ముఠాలు ప్రబలంగా తయారయ్యాయి. నిత్యం ఈ రెండు వర్గాల మధ్య కొట్లాటలు తగాదాలు జరుగుతూ ఉండేవి. పార్టీకి సంబంధించిన ఏ ఈవెంట్ వచ్చినా సరే రెండు వర్గాలు పోటాపోటీగా నిర్వహించడం- ఆ సందర్భంగా ఘర్షణలు పడడం జరుగుతూ ఉండేది. పోలీసులు అధికార పార్టీలోని రెండు ముఠాల మధ్య గొడవలు జరగకుండా చూడడానికి నిత్యం పోలీసు పికెట్లు నిర్వహిస్తూ ఉండేవారంటే పరిస్థితి ఎంత దిగజారి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కరణం బలరాం ఇన్ని కష్టాలు పడుతూ తన కొడుకు వెంకటేష్ ని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు 2024 ఎన్నికల్లో అదే చేరాలని నియోజకవర్గం నుంచి తన వారసుడిగా వెంకటేష్ కు వైసీపీ టికెట్ ఇప్పించుకోవడంలో కృతకృత్యులయ్యారు. కానీ ఆమంచి బెడద మాత్రం తొలగిపోలేదు. వైసీపీ తనను పక్కన పెట్టిందని ఆగ్రహించిన ఆమంచి కృష్ణమోహన్ అప్పటికప్పుడు షర్మిల సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి నిలిచారు. తారు గెలిచినా గెలవకపోయినా కరణం వెంకటేష్ ఓటమి ఒక్కటే తన లక్ష్యం అన్నట్లుగా పనిచేశారు. దానికి తగ్గట్టే వెంకటేష్ ఓటమి, బలరాంకు పరాభవం తప్పలేదు.
ఇప్పుడు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే.. జగన్ సారధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది అర్థం కాని సంగతి. ఒకవేళ ఏదో ఒక నాటికి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నప్పటికీ చీరాల నియోజకవర్గంలో ఉన్నంతకాలం ఆమంచి కృష్ణమోహన్ ముఠాలతో తలపడి నెగ్గడం అసాధ్యం అని బలరాంకు అర్థమైంది. అందుకే కొడుకు వెంకటేష్ ను నియోజకవర్గం మార్చాలని తలపోస్తున్నట్లుగా సమాచారం. తమకు సేఫ్టీ ఉన్న చోటు ఇవ్వాలని అడిగితే జగన్మోహన్ రెడ్డి అందుకు అధినేత ఒప్పుకుంటారా? అనేది డౌటే! ఒకవైపు గతంలో బలరాం గెలిచిన అద్దంకి నియోజకవర్గం తీసుకోవాలని అనుకుంటున్నారట. అక్కడి వైసీపీ పార్టీ ఇన్చార్జి హనిమిరెడ్డి ప్రస్తుతానికి అంత యాక్టివ్ గా లేరని చెప్పుకుంటున్నారు. అలాగని వెంకటేష్ అక్కడకు వచ్చే పరిస్థితి వస్తే హనిమిరెడ్డి మాత్రం ఊరుకుంటారా అనేది ఇంకో సందేహం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక బలరాం, ఆయన కొడుకు వెంకటేష్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.