మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో ప్రజాధనాన్ని దోచుకున్న వారు ఎలా తప్పించుకోవాలని ప్రయత్నించారో.. ఎలా పరారీలోకి వెళ్లి అజ్ఞాతంలో ఎక్కడెక్కడ గడిపారో.. ఇప్పటి దాకా జరిగిన విచారణను బట్టి.. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కొన్ని వివరాలు సేకరించింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ దళాలన్నీ కూడా.. అసలు మద్యం కుంభకోణం అనేదే లేదని.. చంద్రబాబునాయుడు ఒక తప్పుడు కేసును ఫ్యాబ్రికేట్ చేయించారని రకరకాల బుకాయింపు మాటలు పలుకుతున్నారు. వైసీపీ వారిని, స్కామ్ భాగస్వాములను విచారించడం ద్వారా అనేక వివరాలను రాబడితే.. తమ వారిని బెదిరించి వారికి కావాల్సినట్టుగా చెప్పిస్తున్నారని దబాయిస్తున్నారు. కానీ.. ఇప్పుడు ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధంలేని థర్డ్ పార్టీ వ్యక్తిని విచారించినప్పుడు కూడా సిట్ సేకరించిన వివరాలే సత్యాలు అని తేలుతోంది. సిట్ విచారణలో సేకరించిన వివరాలన్నీ అక్షర సత్యాలనీ, కోర్టు దాకా వెళ్లిన తర్వాత.. ఈ నిందితులు ఎవ్వరూ కూడా తప్పించుకోజాలరని, అంతిమ లబ్ధిదారుకు కూడా రోజులు మూడినట్టేనని పలువురు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. లిక్కర్ కుంభకోణంలో భాగస్వాములైన అనేక మంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరారయ్యారు. దేశం విడిచి వెళ్లిపోయారు. కేసు బయటకు వస్తే తాము తప్పించుకోలేం అనే భయంతోనే వారంతా.. ప్రభుత్వం మారిన వెంటనే జాగ్రత్త పడ్డట్టుగా వివరాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు అయిన శ్రవణ్ రావు పేరు కూడా బయటకు వచ్చింది. దుబాయ్ లో ఆయనకు చెందిన ఒక అత్యంత విలాసవంతమైన ఫ్లాట్ లో ఫోన్ ట్యాపింగ్ నిందితులు చాలా రోజుల పాటు తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ విషయాలను నిర్ధరించుకోవడానికి శ్రవణ్ రావును విచారణకు పిలిచినప్పుడు ఆ వివరాలన్నీ ఆయన ధ్రువీకరించినట్టుగా తెలుస్తోంది.
మద్యం కుంభకోణంలో ఏ40 వరుణ్ పురుషోత్తం, ఏ8 బూనేటి చాణక్య ఇద్దరూ దుబాయ్ పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీలోని తన ఫ్లాట్ కు తరచూ వచ్చేవారని, ఫిబ్రవరి మార్చి మధ్యలో 50 రోజుల పాటు అక్కడే ఉన్నారని శ్రవణ్ రావు సిట్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అప్పటికి వారు మద్యం కేసులో నిందితులు గా పరారీలో ఉన్న సంగతి తనకు తెలియదని చెప్పారు. ఒక మిత్రుడి ద్వారా పరిచయం అయ్యారని.. తాను దుబాయ్ వెళ్లడానికి ముందునుంచి వారు అక్కడే వేర్వేరు చోట్ల ఉన్నారని, తాను దుబాయ్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా.. వేర్వేరుచోట్ల దుబాయ్ లోనే గడిపారని ఆయన ధ్రువీకరించారు.
శ్రవణ్ రావు ద్వారా.. లిక్కర్ స్కామ్ పాత్రధారులు ఎన్నెన్ని మాయలు చేశారో, దొరక్కుండా తప్పించుకోవడానికి ఎన్ని పన్నాగాలు పన్నారో ధ్రువపడుతోంది. అదేవిధంగా హవాలా మార్గాల్లో దుబాయ్ లో పెట్టిన పెట్టుబడులు, తరలించిన వేల కోట్ల రూపాయలు అన్ని వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ధ్రువీకరించుకునే పనిలో సిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది.