పులివెందుల మండలం జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక వైపు ఇప్పుడు యావత్ రాష్ట్రం ఆసక్తిగా చూస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంత మండలంలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో.. అందరి దృష్టి ఉంది. ఈ ప్రాంతంలో ఆ కుటుంబానికి ఉన్న బలం తక్కువేమీ కాదు. అయినా కూడా.. ఇక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. పోటీకి దిగిన తెలుగుదేశం కార్యకర్తల్ని వైసీపీ వారు రెచ్చగొడుతున్నారు. ఉద్రిక్తత నెలకొంటోంది. చాలా గొడవలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ఒక్కో ఓటుకు పదివేల రూపాయల వంతున అయినా ఇచ్చి గెలవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎందుకింత పట్టుదలగా ఉన్నదనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ జడ్పీటీసీ స్థానానికి అసలు తెలుగుదేశం ఎన్నికలలో పోటీచేయడమే.. వారికి కంటగింపుగా ఉన్నదని.. అందుకే ఘర్షణలకు దిగుతున్నారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..
పులివెందుల జడ్పీటీసీ స్థానం చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి ఎన్నిక జరిగింది. ఆ ఒక్క ఎన్నిక కూడా దాదాపుగా ఏకగ్రీవం అన్నట్టుగా ముగిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నుంచి ప్రతిసారీ ఏకగ్రీవ ఎన్నికలనే నడిపిస్తూ వచ్చారు. కాకపోతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. 2016లో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ రమేష్ యాదవ్ ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అతను నామినేషన్ వేసి.. ఉపసంహరణ గడువు కూడా పూర్తయిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. దాంతో ఆ పార్టీ అధికారిక అభ్యర్థి లింగమయ్యకు వాకోవర్ లభించినట్లు అయింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా జరగలేదు. లింగమయ్య ఆటోమేటిగ్గా గెలిచాడు.
అప్పటి జగన్ దళాలు ఇన్ని కుట్రలు చేసినప్పటికీ.. అప్పటికి ఉన్న 8500 ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లభించిన మెజారిటీ రెండున్నరవేలు మాత్రమే. తెలుగుదేశం అభ్యర్థి పార్టీ ఫిరాయించేసినా.. బరిలో లేకపోయినా, ప్రచారం జరగకపోయినా.. సైకిలుకు 2600 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత 2021 లో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. బెదిరించిగానీ, ప్రలోభపెట్టిగానీ, కుట్రలు చేసి గానీ.. ప్రతిసారీ ఏకగ్రీవం చేసుకునే తమ రికార్డుకు భంగకరంగా ఈసారి ఎన్నిక జరగడమే వైసీపీ నేతలకు ఇష్టం లేదు. తెలుగుదేశం బరిలోకి దిగడాన్నే వారు సహించలేకపోతున్నారు. ఎవరిని దించినా.. ప్రలోభపెట్టి బెదిరించి పార్టీ మార్చేస్తారనే అనుమానంతో.. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బీటెక్ రవి స్వయంగా తన భార్యను ఇక్కడ అభ్యర్థిగా పోటీచేయిస్తున్నారు. తమ ఏకగ్రీవ పాచిక పారకపోతుండేసరికి వైసీపీ అసహనానికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే అక్కడ వారు నానా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏమాత్రం ప్రచారం లేకుండానే 2600 ఓట్లు గెలుచుకున్న తెలుగుదేశం.. ఈసారి గణనీయంగా తమ బలాన్ని పెంచుకుంటుందని, గెలిచినా కూడా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.