చంద్రబాబు నాయుడు సారాధ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి శాంతిభద్రతల పరిస్థితులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయి. ఎన్నికల వేడిలో చోటు చేసుకున్న కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా రాష్ట్రమంతా శాంతియుత వాతావరణం స్థిరపడింది. అయితే రాష్ట్ర ప్రజలు ఇలా ప్రశాంతత మధ్య జీవనం సాగించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహింపరాని విషయంగా ఉన్నట్లుంది. తమకు వీలైన మార్గాలలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి వైసిపి కీలక నాయకులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మీద రెచ్చిపోయి విమర్శలు సాగిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోవాలని హితవు చెబుతున్న వారు కొందరైతే.. మరికొంద రు తెలుగుదేశం నాయకులతో తగాదాలు వచ్చినప్పుడు అవసరమైతే చంపడానికే నా సిద్ధంగా ఉండాలని పిలుపు ఇస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి కీలక నాయకుడుగా పార్టీలో చక్రం తిప్పుతూ ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులను రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులు. ప్రభుత్వం చేసే ప్రచారాలను దారుణంగా తిప్పి కొట్టాలని సోషల్ మీడియాలో చెలరేగిపోతూ ఉండాలని విచ్చలవిడిగా పోస్టులు పెడుతూ ఉండాలని ఆయన అనునిత్యం కార్యకర్తలకు పిలుపు ఇస్తూనే ఉంటారు. నిజానికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల సైకో బుద్ధులకు కొన్ని నెలలుగా పగ్గాలు పడ్డాయి. అందరూ అదుపులో ఉంటున్నారు. చెత్త పోస్టులు పెట్టే వారి మీద ప్రభుత్వం కత్తి దూస్తుండడంతో.. అందరూ జాగ్రత్త పడుతున్నారు. వైసీపీకి అనుకూలంగా నీచమైన పోస్టులు పెట్టడం వలన.. తమకు దక్కే లాభమేమీ లేదని క్లారిటీ తెచ్చుకుంటున్న వాళ్లు.. ఆ దూకుడు పూర్తిగా మానుకుంటున్నారు. అయితే.. వీరిని రెచ్చగొట్టి పూర్వస్థాయిలో.. వారితో సైకో పోస్టులు పెట్టించడమే రామక్రిష్ణా రెడ్డి లక్ష్యం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అధికార పార్టీ వాళ్లు విమర్శలు చేస్తే సోషల్ మీడియా కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టాలంటూ ఆయన చేస్తున్న హితోపదేశాలు మరీ వంకరగా ఉంటున్నాయి. తమ కార్యకర్తలందరినీ జైళ్లకు పంపిస్తే తప్ప సజ్జల శాంతించేలా లేరని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.
ఇదిలా ఉండగా.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోస్థాయిలో రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం నాయకులతో తగాదాలు వస్తే.. చంపేందుకు అయినా వెనకాడకుండా ఉండాలని ఆయన తన అనుచరుల్ని కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. కియా సంస్థ యాజమాన్యాన్ని బూతులు తిట్టి బెదిరించి తన దందా సాగించాలని చూసిన ఈ మాజీ ఎంపీ పూర్వాశ్రమంలో పోలీసు అధికారి కూడా కావడం చిత్రమైన సంగతి. ఇలాంటి వారి పోకడలను గమనిస్తే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడం వైసీపీకి ఇష్టం లేదని అర్థమవుతోంది.