పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేయడం గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేధావులు గత కొన్ని రోజులుగా తెగ గగ్గోలు పెడుతున్నారు. 45.7 మీటర్ల ఎత్తు ఉండవలసిన పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తున కుదించడం వలన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలన్నీ మొసలి కన్నీరు కారుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తక్కువ ఉండడం కారణంగా నీటినిల్వ సామర్థ్యం బాగా తగ్గుతుందని.. అందువలన బనకచర్ల ప్రాజెక్టు కట్టినా కూడా వృధా అవుతుందని మోకాలికి బోడి గుండు కి ముడిపెట్టినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు బనకచర్ల కట్టవలసిన అవసరమే లేదని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టును ముందు అనుకున్నట్లుగా 45.7 మీటర్ల ఎత్తు వరకు కట్టాలని సూచిస్తున్నారు. అయితే అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు సుమారు నాలుగున్నర మీటర్లు తగ్గి 41.15 మీటర్లకు కుదిరించబడడం వెనుక అసలు పాపం జగన్మోహన్ రెడ్డి దే అని ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిని అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు అనే వైయస్ కలను సాకారం చేయడానికి చేసిన ప్రయత్నం ఒక్కటి కూడా లేనేలేదని షర్మిల విమర్శిస్తున్నారు. వైయస్సార్ కలలుగన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తన ఐదేళ్ల పదవీకాలంలో ఒక తట్ట మట్టి కూడా ఎత్తి పక్కన పోయలేదని జగన్మోహన్ రెడ్డి తీరును ఆమె తీవ్రంగా నిరసించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఖజానాకు మేలు చేకూరుస్తున్నాను అనే మాయ మాటలు చెబుతూ.. అది వరకు చంద్రబాబు హయాంలో పనులు చేస్తూ వచ్చిన నిర్మాణ సంస్థను బలవంతంగా పక్కకు తప్పించి మెగా కృష్ణారెడ్డి చేతిలో పోలవరం పెట్టారు. అయితే ఐదేళ్లలో పోలవరం నిర్మాణ పనులు ఏ మాత్రం చురుగ్గా సాగలేదు.
ఐదేళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడనే అన్న సామెత చందంగా ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో కొన్ని పదుల సార్లు ఢిల్లీ వెళ్లి, కేంద్రంలోని పెద్దలతో సమావేశం కావడానికి ప్రయత్నించారే తప్ప పోలవరానికి నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేయడం గురించి శ్రద్ధ పెట్టలేదు. ఎంతసేపూ తన మీద ఉన్న సిబిఐ ఈడి కేసులలో ఉపశమనం కావాలని, ఇలాగే తమ్ముడు అవినాష్ రెడ్డి మీద వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ఉన్న ఆరోపణలు పక్కదారి పట్టించడానికి ఈ పర్యటనలను జగన్మోహన్ రెడ్డి వాడుకున్నా రని ప్రజలు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే 2022లో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్ల ఎత్తున కుదిరించబడడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డే అని షర్మిల విరుచుకు పడుతున్నారు.
దొంగపిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటుంది అన్నట్టుగా.. వైఎస్ జగన్ కూడా.. పోలవరానికి తాను చేసిన ద్రోహాన్ని ఎవరు గుర్తించరులే అనే ఉద్దేశంతో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నట్టుగా కనిపిస్తోంది.