జగన్ మీద గులకరాయి పడడం.. చిన్న గాయం కావడం .. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశమవుతోంది. సానుభూతి సృష్టించుకోవడం కోసం ఇది జగన్ ఆడిన డ్రామాగా టీడీపీ వర్గాలు పదేపదే చెబుతున్నాయి. అంత ఖర్మ మాకేమిటి.. జగన్ సభలకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జగన్ రాయితో కొట్టి చంపేయాలని చంద్రబాబు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను పురమయించారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం నిందితులను పట్టుకోవడం అంతా సులువు కాదని అంటున్నారు. ఈ రచ్చ ఇలా సాగుతుండగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నుదుటి మీది గాయానికి కట్టుకున్న బాండేజీ కూడా చర్చకు వస్తోంది.
జగన్ నుదుటి మీద ఆకతాయి విసిరిన రాయి తగిలింది. ఒక సెంటీమీటర్ పొడవున గాయమైంది. సాక్షి మీడియా తొలుత ఒక సెంటి మీటర్ లోతైన గాయం అయినట్టుగా ప్రచారం చేశారు గానీ.. అంత లోతు అంటే ప్రజలు నమ్మరని.. నుదుటిమీద అంతలోతు అంటే పుర్రె పగిలి మెడకు కూడా గాయం కావాలని గ్రహించి కామ్ అయిపోయారు. కానీ ఈ గాయం ద్వారా వచ్చే ఎడ్వాంటేజీ ని జగన్ వదలుకోవాలని అనుకోవడం లేదు.
నిజం చెప్పాలంటే ఆ మాత్రం గాయాలు మన ఇళ్ళలో తరచూ అవుతుంటాయి. ఆటలు ఆడుకోవడంలో పసి పిల్లలకు కూడా ఆ మాత్రం గాయాలు అవుతుంటాయి. చాలా సాధారణంగా గాయం ఆయిన వెంటనే మన ఇంట్లో పెద్దలు నీళ్లతో కడిగి, వెంటనే పసుపు పొడి అద్దుతారు. అంతే. డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళడం కూడా అరుదు. రెండు రోజులకు వాపు తగ్గి, గాయం పొక్కుగట్టి రాలిపోతుంది. కానీ జగన్ ఆస్పత్రికి వెళ్లి కుట్లు కూడా వేయించుకున్నారు. సరే, ఆయన వీవీఐపీ గనుక ఆ జాగ్రత్త అనుకోవచ్చు. కానీ నాలుగు రోజులుగా తలకు పెద్ద బ్యాన్డేజితో తిరుగుతున్నారు. చూడబోతే ఆయన అంత చిన్న గాయానికి బాండేజీని ఎన్నికల ప్రచారం ముగిసేదాకా ఉంచుకుంటారేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు.