ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఇంతదూరం వచ్చిన తర్వాత.. ఇంకా గ్రామాల్లో పంచాయతీలు, గ్రామం నుంచి ఒక వ్యక్తిని బహిష్కరణ చేయడాలు, ఆ విధమైన మనో వేదనకు గురిచేయడాలు వంటి వాటికి ఆస్కారం ఉన్నదా? తప్పు జరిగితే దాన్ని తేల్చడానికి చట్టం, న్యాయం వ్యవస్థీకృతంగా ఉన్నాయి కదా. చిన్న చిన్న తగాదాలను సర్దుబాటు చేయడానికి పెద్దలు జోక్యం చేసుకోవడం బాగానే ఉంటుంది గానీ.. ఒక వ్యక్తి కుటుంబాన్ని గ్రామబహిష్కరణ పేరుతో వేధించడం వరకు శృతిమించితే.. ఇలాగే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. చీరాల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టుకుని.. టీడీపీ కార్యకర్తను వెలివేయడం, అతని దుకాణంలో ఎవ్వరూ కొనుగోళ్లు చేయకుండా నిషేధించడంతో.. మనస్తాపంతో ఆ కార్యకర్త ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పాపం వైసీపీ పెద్దలదేనని ఇప్పుడు గ్రామంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. చీరాల మండలం కావూరివారిపాలెంలో వినాయకచవితి వేడుకల సందర్భంగా ఇరువర్గాల మధ్య చిన్న తగాదా చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన బుజ్జిరెడ్డి అనే వ్యక్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పొట్టయ్య, ఎర్రోడు, చిన్నా అనే వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీనిపై బుజ్జిరెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గ్రామంలో పోలీసు పికెట్ నిర్వహించడం కూడా జరిగింది. అయితే గ్రామ పెద్దల ముసుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.. తమ వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహించారు. చట్టాన్ని ఆశ్రయించడమే వారి దృష్టిలో నేరం అయిపోయింది. తీర్పు వారేచెప్నేశారు. బుజ్జిరెడ్డిని గ్రామబహిష్కరణ చేశారు.
బుజ్జిరెడ్డి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో గ్రామంలోని ఎవ్వరూ సరుకులు కొనరాదని కూడా తీర్పు చెప్పారు. అలా ఎవరైనా బహిష్కరణను అతిక్రమిస్తే లక్షరూపాయల జరిమానా విధిస్తామని కూడా తేల్చారు. దీంతో బుజ్జిరెడ్డి వ్యాపారం నాశనం అయింది. ఒకవైపు అప్పులు పేరుకుపోతుండగా.. బుజ్జిరెడ్డి ఈ బహిష్కరణను తట్టుకోలేకపోయాడు. మనస్తాపంతో ఈ నెల ఒకటోతేదీన పురుగుల మందు తాగిన బుజ్జిరెడ్డి అప్పటికి అందరూ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. శుక్రవారం రాత్రి మళ్లీ.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ఎదుట ఉన్న పందిరిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారంలో లేకపోయినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల పాల్పడుతున్న దుర్మార్గానికి ఇది నిదర్శనం అని, వారు వెలివేసిన కారణంగానే బుజ్జిరెడ్డి మరణించాడని, పోలీసులు ఈ విషయంలో కారకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.