ఉచ్చు బిగుస్తోంది.. జోగి గుబులు పెరుగుతోంది!

చంద్రబాబునాయుడు ఇంటిమీదికి తన అనుచర గూండాలను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పిన పాపానికి కటకటాలు లెక్కపెట్టక తప్పేలా లేదనే భయం మాజీ మంత్రి జోగి రమేష్ లో పెరుగుతోందా? చంద్రబాబు ఇంటిమీదికి రెచ్చిపోయి ఎగబడినందుకు జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్ లో పడి మంత్రి పదవిని సంపాదించుకున్న ఆయన.. అలాంటి దుర్మార్గానికి ఇప్పుడు మూల్యం చెల్లించవలసిన పరిస్థితిలో ఉన్నారా? ఆ భయం ఆయనను ముంచెత్తి.. పోలీసు విచారణకు గైర్హాజరయ్యేలా చేస్తోందా? అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మంగళవారం ఉదయం ఉదయం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసు పంపితే.. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో వస్తానని చెప్పిన జోగి రమేష్ చివరికి గైర్హాజరయ్యారు. తాను రాకుండా తన న్యాయవాదులను పంపడంలోనే ఆయన భయం వ్యక్తమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై అని జోగి రమేష్ కు తెలియదేమో అని కూడా సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఒకరోజు విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నంత మాత్రాన ఆయన అరెస్టు ఆగేది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మంగళవారం విచారణకు రావాలని, 2021లో దాడి జరిగిన రోజు వాడిన మొబైల్ ఫోనుతోపాటు సిమ్ కార్డునుకూడా అప్పగించాలని, అలాగే ప్రస్తుతం వాడుతున్న ఫోనును కూడా అప్పగించాలని దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీకృష్ణ జోగి రమేష్ కు నోటీసు పంపారు. అయితే తొలుత మధ్యాహ్నం వస్తానని చెప్పినప్పటికీ.. న్యాయవాదులను మాత్రమే పంపిన జోగి, 2021లో వాడిన ఫోను మార్చేశానని, సిమ్ కార్డు అప్పటిదే వాడుతున్నానని మాత్రం సమాచారం పంపారు. వాడుతున్నాను గనుక వాటిని ఇవ్వలేనని ఆయన పోలీసులకు తెలియజేయడం గమనార్హం.

అయితే విచారణకు హాజరైతే అక్కడే ఫోను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందనే భయంతోనే జోగి రమేష్ గైర్హాజరైనట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఇంటిమీద జరిగిన దాడికేసులో అరెస్టు భయంతో ముందుగానే బెయిలు తెచ్చుకున్న వైసీపీ నాయకుల్లో జోగి రమేష్ కూడా ఉన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని కండిషన్ చెప్పి ఆయన బెయిలు తెచ్చుకున్నారు. ఇప్పుడేమో విచారణకు పిలిస్తే.. బెయిలు ఉన్నప్పటికీ కూడా వెళ్లడానికి జంకుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories