పీఎస్సార్ చుట్టూ ఉచ్చు : ఎన్ని పాపాలు చేస్తే అన్ని కేసులు!

చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటారు పెద్దలు. ఎక్కువ పుణ్యం చేసిన వాడికి ఎక్కువ సుఖాలు, తక్కువ పుణ్యం చేసుకున్న వాడికి తక్కువ సుఖాలు స్వర్గలోకంలో లభిస్తాయని ఊరించడం వారి ఉద్దేశం కావచ్చు. మరి ఇదే సిద్ధాంత సామెత.. పాపాలకు కూడా వర్తిస్తుంది కదా! ఖచ్చితంగా వర్తిస్తుంది అని నిరూపిస్తున్నాయి.. ఇప్పుడు వైసీపీ నాయకుల వ్యవహారంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు! జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు లెక్కకు మిక్కిలిగా పాపాలు చేశారు. నాయకులతో పోటీపడుతున్నట్టుగా.. అధికారులు కూడా.. విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు అందరి పాపాలు, అన్ని పాపాలు బయటపడుతున్నాయి. ప్రతి పాపానికీ విడివిడిగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి.
జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం.. ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీని , ఆమె కుటుంబాన్ని అక్రమంగా నిర్బంధించి వేధించిన కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన జగన్ పాలన కాలంలో.. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా  ఉన్న రోజుల్లో గ్రూప్ 1 ప్రశ్నపత్రాల మూల్యాంకనం విషయంలో పాల్పడిన అరాచకాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. హాయ్ ల్యాండ్  రిసార్టుల్లో గదులు అద్దెకు తీసుకుని మూల్యాంకనం చేయించిన వైనం.. అందుకు చెల్లించిన కోట్ల రూపాయల నిధులు అన్నీ ఇప్పుడు కేసుల్లోకి వస్తున్నాయి. ఆ వ్యవహారాల్లో ఆయన పాల్పడిన పాపాలు కూడా లెక్క తేలితే.. ఆయనకు మరో రిమాండు కూడా పడే అవకాశం ఉంది. పీటీ వారెంటు తీసుకుని.. ఆ కేసులో కూడా ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు.

చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి దర్యాప్తు చేయిస్తున్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత.. ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మోసం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, సాక్ష్యాల తారుమారు, నేరపూరిత కుట్ర, తదితర సెక్షన్ల కింద ఆయనపై ఈ వ్యవహారంలో కేసులు నమోదు అయ్యాయి. హాయ్ లాండ్ రిసార్టుల్లో మూల్యాంకనం చేయగా, అక్కడి ఏర్పాట్లు చూసినందుకు కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 1.14 కోట్ల రూపాయల మేర చెక్కురూపంలో చెల్లించారు. ఆ లావాదేవీలన్నింటి గురించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ప్రైవేటు హోటళ్లలో గ్రూప్ 1 మూల్యాకనం చేయించడం చట్టవిరుద్ధం అని తెలిసీ చేయించారనే  ఆరోపణలున్నాయి. ఏర్పాట్లు కోసం కోటిరూపాయలకు పైగా ఫీజు పుచ్చుకున్న  కామ్ సైన్ మీడియా సంస్థ ఎవరిది.. వారి వెనుకనుంచి ఈ దందా నడిపించిన వారెవ్వరు? అనే సమస్త వివరాలపై విచారణ సాగుతోంది.

నాయకుల విషయంలో మాత్రమే కాదు.. పీఎస్సార్ ఆంజనేయులు వంటి అధికారుల విషయంలో కూడా గత ప్రభుత్వంలో ఎన్ని పాపాలు చేసి ఉంటే అన్ని కేసులు నమోదు అవుతాయని, అన్నింటికీ తగిన శిక్షలు వరుసగా అనుభవించాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories