ఆ ముగ్గురు : గుమ్మడికాయల దొంగల్లోని ఆందోళన!

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న ప్రబుద్ధుల కథ మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి జమానాలో అన్నీ తామై చెలరేగిపోయిన వారు.. అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు బయటకు వస్తుండేసరికి.. ఏ క్షణాన కటకటాల వెనుకకు వెళ్లాల్సి వస్తుందో అని తెగ ఆందోళన చెందుతున్నారు. అరెస్టులు తప్పవని నిలువెల్లా భయంతో వణుకుతున్నారు. ముందస్తు బెయిలు కావాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు హైకోర్టులో పిటిషన్ వేసి.. అక్కడ తీర్పు రాకముందే.. ఆరాటం నిగ్రహించుకోలేక.. సుప్రీం కోర్టులో కూడా మరో పిటిషన్ వేశారంటే.. వారెంతటి భయంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే సుప్రీం ధర్మాసనం మాత్రం.. ఆ పిటిషన్లను నిర్మొహమాటంగా తిరస్కరించింది. ముందు హైకోర్టులో ఏ సంగతి తేలేదాకా, వాటి సంగతి చూడలేం అని తేల్చిచెప్పింది.

దాదాపు 3500 కోట్లరూపాయలను వైసీపీ పెద్దలందరూ కలిసి కాజేసిన మద్యం కుంభకోణంలో.. ఇప్పటికే పలువురు కీలకమైన పాత్రధారులు నిందితుల జాబితాలోకి ఎక్కారు. కొందరు అరెస్టు కూడా అయ్యారు. కస్టోడియల్ విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. కస్టడీలో ఉన్నవారు, సాక్షులు ఇలా రకరకాల వ్యక్తులు అందించిన సమాచారాన్ని బట్టి.. అనుమానితులు కూడా దండిగానే ఉన్నారు. కాకపోతే వారింకా నిందితుల జాబితాలోకి ఎక్కలేదు. విచారణకు రావాల్సిందిగా ఇంకా నోటీసులను కూడా అందుకోలేదు. కానీ.. వారిలో భయం మాత్రం తారస్థాయికి చేరుతోంది.

మద్యం కుంభకోణంలో మిస్టర్ అండ్ మిసెస్ బిగ్ బాస్ తరఫున.. ముడుపులు సొమ్ములను ఫైనల్ గా అందుకున్న కీలక వ్యక్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంపేషీలో కీలక భూమిక పోషించిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, అలాగే భారతి సిమెంట్స్ లో పర్మినెంట్ డైరక్టర్ గా, ఆ సంస్థ యొక్క సమస్త ఫైనాన్షియల్ వ్యవహారాలను చూస్తూ ఉండే గోవిందప్ప బాలాజీలు ఉన్నారు. తన నెట్ వర్క్ ద్వారా డిస్టిలరీలు, మద్యం తయారీదార్లనుంచి వసూలు చేసిన సొమ్ములను ఫైనల్ గా వీరికి చేర్చినట్లుగా ఏ1 నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.

వీరి పేర్లను సిట్ పోలీసులు నిందితులుగా చేర్చకపోయినప్పటికీ వీరు ముందే అలర్ట్ అయ్యారు. తమకు ముందస్తు బెయిలు కావాలని, అరెస్టు నుంచి రక్షణ కావాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ ఇంకా తుదితీర్పు రాకముందే.. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టులో వ్యవహారం పెండింగులో ఉన్నందున మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘అరెస్టు చేయబోం’ అంటూ రాష్ట్రప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ కావాలని.. అనుమానితుల న్యాయవాదులు కోరగా అందుకు కూడా సుప్రీం ధర్మాసంన తిరస్కరించింది. హైకోర్టులో ఈ పిటిషన్ 7వ తేదీనాటికి వాయిదా ఉండగా.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించిన ధర్మాసనం.. అక్కడ ఆదేశాలు వచ్చిన తర్వాత.. తాము విచారణ చేపడతాం అంటూ పేర్కొంది.

అసలు నిందితుల జాబితాలో పేరు లేకపోయినా కూడా.. జగన్మోహన్ రెడ్డికి, ఆయన భార్య భారతికి అనుంగు నమ్మకస్తులైన అనుచరులుగా పేరున్న ఈ ముగ్గురూ ముందే బెయిలుకోసం, అరెస్టు నుంచి రక్షణ కోసం దావాలు నడపడం చూస్తోంటే.. ఏ తప్పూ జరగకుండానే.. వారు అరెస్టు గురించి అంతగా భయపడుతున్నారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories