అనుకున్నట్టే పరారీలో ఆ ముగ్గురు నిందితులు!

దాదాపు 3,500 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడి, లిక్కరు కంపెనీల నుంచి వాటాలు స్వాహా చేసినట్లుగా నిగ్గు  తేలిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుల ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారికి ముందస్తు బెయిల్  ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించి మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవాలని 13వ తేదీ నాటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక నిందితులు.. ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 13వ తేదీ నాటికి మరొక ముందస్తు బయలు పిటిషన్ దాఖలు చేసే లోగా అరెస్టు నుంచి రక్షణ  ఇవ్వాలన్న వారి కోరికను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో సిట్ పోలీసులు ఏ క్షణాన అరెస్టు చేస్తారో అనే భయంతో ఆ ముగ్గురు పరారైనట్లుగా తెలుస్తోంది. సుప్రీం ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఈ ముగ్గురు పరారయ్యే అవకాశం ఉందని తెలుగు మోపో డాట్ కామ్ అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే వారు మాయమయ్యారు. వారికోసం సిట్ బృందాలు హైదరాబాదు, బెంగుళూరు సహా పలుచోట్ల విస్తృతంగా గాలిస్తున్నాయి.

జగన్ వ్యక్తిగత కార్యదర్శి కే నాగేశ్వర్ రెడ్డి, అలాగే సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసాలలో ఈ నిందితులు ఉన్నారని సమాచారం రావడంతో అక్కడ కూడా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఇతర పోలీసు అధికారులు ఆధ్వర్యంలోని బృందాలు  తనిఖీలు నిర్వహించాయి. వీరిద్దరితో ఆ నిందితులు ముగ్గురూ టచ్ లో ఉన్నట్లుగా సిట్ పోలీసులు గుర్తించారు.  వారికి అందుబాటులోకి వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ సూచించారు.

మరికొన్ని వారాలపాటు  కీలక నిందితులు ముగ్గురు అజ్ఞాతంలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు  విశ్వసనీయంగా తెలుస్తోంది. 13వ తేదీ నాటికి లిక్కర్ కుంభకోణం కేసు నుంచి ముందస్తు బెయిల్  కావాలంటూ ఫ్రెష్ గా సుప్రీంకోర్టులో వారు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత వాద ప్రతివాదాలు జరిగి సుప్రీమ్ న్యాయస్థానం వారికి అనుకూలంగా ముందస్తు బెయిల్ గాని, అరెస్టు నుంచి రక్షణగాని కల్పిస్తే తప్ప వారు అజ్ఞాతంలో నుంచి బయటకు రాకపోవచ్చునని సమాచారం.

లిక్కర్ కుంభకోణంలో ఏ1 ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం డిస్టిలరీల నుంచి వాటాల డబ్బును తన నెట్వర్క్ ద్వారా వసూలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెలా 50 నుంచి 60 కోట్ల రూపాయల సొమ్ములు వసూలు చేసి బిగ్ బాస్ కు అత్యంత విశ్వసనీయులు అయినటువంటి వీరి చేతికి అందించే వారిని వాంగ్మూలంలో తేలింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి జగన్ కోటరీ మనుషులు కాగా.. గోవిందప్ప బాలాజీ జగన్ భార్య వైఎస్ భారతి కి విశ్వాస పాత్రుడు. ఈ ముగ్గురిని విచారిస్తే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే విషయంలో స్పష్టత వస్తుంది. అందుకోసమే సిట్ పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories