మామూలుగా తప్పు చేసిన వాడు పారిపోతే.. పోలీసు తరుముకోవాలి. కానీ.. తప్ప చేసిన వాడే పోలీసును తరమడం ప్రారంభిస్తే దాన్ని ఏం అనాలి? ఈ వ్యవహారాన్నే ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అని అంటారు. లేకపోతే అలాంటివాళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అని కూడా అనవచ్చు. ప్రస్తుతం వారి తీరు, వారు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే అలాగే అనిపిస్తుంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. ఆయన పర్యటనకు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయలేదట. ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తోంటే.. బందోబస్తు ఏర్పాటు చేయరా.. అంటూ వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఇతర నాయకులు మహా గగ్గోలు పెడుతున్నారు. తమాషా ఏంటంటే.. అసలు జగన్ ప్రతిపక్షనాయకుడని ఎవరు అన్నారు? ఆయన ఆ గుర్తింపు ఎప్పుడు లభించింది. అధికారంలో లేని ప్రతివాడూ ప్రతిపక్ష నాయకుడు అయిపోతాడా? లేదా, ఉన్న పదిమందీ.. తమ నాయకుడిని భజన చేసుకోవడానికి తమ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటే సరిపోతుందా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.
పోలీసులు తమ నాయకుడికి రక్షణ కల్పించడం లేదని.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మాటలతో దాడి చేయడం గమనిస్తోంటే నవ్వు వస్తోంది. నిజంగానే పోలీసుల చేతగానితనం మీద ఆశ్చర్యం కూడా కలుగుతుంది. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్ ఉన్నది గనుక.. ఎలాంటి ప్రదర్శనలు కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి కి పోలీసులు ముందుగానే ఆ విషయం తెలియజేశారు. కానీ తన పరామర్శ కంటె రాద్ధాంతాన్నే ఎక్కువగా కోరుకునే జగన్మోహన్ రెడ్డి.. పోలీసుల సూచనలను ధిక్కరించి గుంటూరు మిర్చి యార్డు పర్యటన పెట్టుకున్నారు. అది నిబంధనలకు విరుద్ధం. నిజానికి ఆయన ఇంట్లోంచి కదలకుండా.. పోలీసులు హౌస్ అరెస్టు చేసి ఉండాలి. అలా జరగాలనే జగన్ కోరుకున్నారు. కానీ.. అలా చేసినా కూడా.. దానిని తన రాజకీయ మైలేజీకి వాడుకోవడానికి జగన్ కుట్ర చేయగలడు గనుక.. పోలీసులు పట్టించుకోలేదు. తీరా జగన్ వెళ్లి పరామర్శల ప్రహసనం పూర్తిచేసి వెళ్లిపోయారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కూడా నమోదు అయింది.
ఇప్పుడు ఆయన వందిమాగధులు అందరూ.. తమ నాయకుడు వస్తే.. ఆయనకు భద్రత కల్పించరా.. అంటూ నానా యాగీ చేస్తున్నారు. ఆయన పర్యటనే, కార్యక్రమమే చట్టవిరుద్ధం, నేరం అని అంటుండగా.. మళ్లీ దానికి పోలీసులు భద్రత కల్పించలేదని ఎదురుదాడికి దిగడం.. వైసీపీ నాయకులకు మాత్రమే చేతనైనా కుటిల విద్య అని జనం నవ్వుకుంటున్నారు. ఇలాంటి వక్రచేష్టలే చేస్తూ ఉంటే.. జనంలో వారు మరింతగా పలుచన అయిపోతారని వ్యాఖ్యానిస్తున్నారు.