సేన చెడుగైన దండనాధుని తప్పు అని నరసింహ శతకంలో ఒక పద్యం ఉంటుంది. మరి దండనాధుడు చెడ్డ వాడు అయితే ఆ తప్పు ఎవరిది? తప్పెవరిది అనే చర్చ కాసేపు పక్కన పెడదాం.. దండనాధుడు దుర్మార్గుడు అయితే దాని పర్యవసానం, ఫలితం ఎలా ఉంటుంది? ఆ కష్టాన్ని ఇప్పుడు ఏపీలో సచివాలయ ఉద్యోగుల సంఘం అనుభవిస్తోంది. ఆ సంస్థకు మొన్నమొన్నటిదాకా సారథ్యం వహించిన వెంకట్రామిరెడ్డి.. ప్రభుత్వోద్యోగిగా తనకు ఉన్న పరిమితులను మరచిపోయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించినందుకు ఇప్పుడు ఆ సంఘం మనుగడే ప్రమాదంలో పడుతోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్పా) గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలంటూ.. ప్రభుత్వం వారికి నోటీసులు ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ ఉద్యోగుల సంఘం అప్పాకు వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడు. ఆయనతో సహా కార్యవర్గ సభ్యులందరూ కూడా తక్షణం రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఉద్యోగుల పేరిట పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వారి పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వెంకట్రామిరెడ్డి కులాభిమానంతో పాటు, ఇతర వక్ర ప్రయోజనాలు ఆశించి.. గత ప్రభుత్వం ఎదుట సాగిలపడ్డారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలు పణంగా పెట్టి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొమ్ముకాశారనే ఆరోపణలున్నాయి. పైగా ప్రభుత్వోద్యోగి అయి ఉండి కూడా.. వెంకట్రామిరెడ్డి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ పార్టీకి మేలు కలిగేలా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో అప్పా గుర్తింపునే రద్దు చేయడానికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పరిస్థితి ఇంతదాకా రావడంపై సంఘ సభ్యులు మండిపడుతున్నారు.
‘రూసా రూల్స్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయడం పెద్ద తప్పు. నీ కారణంగా సంఘం గుర్తింపు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యతను మరచి, గత ప్రభుత్వం భజనలో మునిగిపోయారు. ఇక ఆ పోస్టులో ఒక్క క్షణం కూడా ఉండే అర్హత మీకు లేదు. ఇన్నాళ్లు ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ఇప్పుడైనా మీ పదవులకు రాజీనామా చేసి అప్పా అస్తిత్వాన్ని కాపాడండి’ అంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. తమది ఎలక్టెడ్ బాడీ గనుక తప్పుకునేది లేదని వెంకట్రామిరెడ్డి అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. అప్పా గుర్తింపు రద్దయినా కావొచ్చునని పలువురు భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడిని సారథిగా ఎన్నుకుంటే వ్యవస్థ మనుగడే ఎంతగా ప్రమాదంలో పడుతుందో తెలుసుకోవడానికి ఇది ఉదాహరణ అంటున్నారు అప్పా సభ్యులు.