జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, అవినీతి ఆర్జనలకు సంబంధించి సుమారు పదేళ్లకు పైగా కేసులు, విచారణ నడుస్తూనే ఉంది. ఒక పట్టాన ఏదీ తేలడం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా.. తాను అడిగిన మినహాయింపులు కోర్టు అనుమతించక, ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి వెళుతుండేవారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం.. ఆ నెపం పెట్టి కోర్టుకు స్వయంగా రావడం మానుకున్నారు.
అయితే.. ఆయన కేసులు ఎంతకీ తేలకపోవడం గురించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విషయంలో న్యాయమూర్తి వ్యాఖ్యలు.. జగన్ కు చేదుగా ధ్వనించేవే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో చాలా జాప్యం జరుగుతున్నదని, ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ.. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామక్రిష్ణరాజు అప్పట్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. అసలు జగన్ కేసుల విచారణలో వరుసగా దాఖలవుతున్న దరఖాస్తులు విస్మయం కలిగిస్తున్నాయంటూ న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఆ దరఖాస్తులతో నిమిత్తం లేకుండా.. విచారణను కొనసాగించాలంటూ న్యాయమూర్తి సూచించారు.
ఇప్పటికే జగన్ కు తన అక్రమాస్తుల కేసుల విషయంలో ఒక ఎదురుదెబ్బ తగిలిఉంది. ఆయన మీద కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం గతంలో ఆదేశించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంటోంది. విచారణ కోర్టులను నియంత్రించలేం అంటూనే.. రఘురామ పిటిషన్ పై విచారణను నవంబరు 11ను వాయిదా వేశారు.
తన అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా సుదీర్ఘకాలం తప్పించుకుంటూ కాలం వెళ్లబుచ్చడం సాధ్యం కాదని న్యాయనిపుణులు భావిస్తున్నారు. రోజువారీ విచారణలతో పాటు, రఘురామ పిటిషన్ వలన విచారణలో వేగం పెరిగినా కూడా.. త్వరలోనే జగన్ కు శిక్షలు ఖరారు అవుతాయని అంటున్నారు. జగన్ ఒకవైపు ఎన్డీయే ప్రభుత్వం మీద అనుచిత అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడుతూ కేంద్రానికి చికాకు కలిగిస్తున్నారని, ఇన్నాళ్లూ సత్సంబంధాలతో నెట్టుకొచ్చినట్టుగా ఇకపై సాగదని కూడా అంటున్నారు.