నిజాయితీ పరుడి మద్దతు గొప్ప నైతిక బలం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సత్తా పార్టీ యొక్క ఓటు బ్యాంకు ఎంత?  అనే వికటప్రశ్నలు వేయడం వలన ఉపయోగం లేదు. నిజమే వారికి సాంప్రదాయ ఓటు బ్యాంకు లేదు. ఆధునిక తరం రాజకీయాల్లో ఇమడలేక లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ఎంతో కాలం కిందటే.. దాదాపుగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఓటు బ్యాంకు లేకపోవచ్చు గానీ.. జయప్రకాశ్ నారాయణ మాటకు ప్రజల్లో విలువ ఉంది. ఆయన అభిప్రాయానికి ఒక నిబద్ధత ఉంటుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాంటి నేపథ్యంలో ఇవాళ లోక్ సత్తా జేపీ ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటిస్తూ చేసిన ప్రకటన .. విపక్ష కూటమికి చెప్పుకోదగినంత ఎడ్వాంటేజీనే అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

లోక్ సత్తా జేపీ బుధవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధిని చూసి ఓటేయాలి.. సంక్షేమం- అభివృద్ధి మధ్య సమతూకం ఉండాలి.. అంటూ జగన్ సర్కారు చేతలను పరోక్షంగా దెప్పి పొడిచారు. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును కాపాడే వారు ఎవరో ఆలోచించాలని జేపీ అనడం గమనిస్తే.. లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజార్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపట్ల ధర్మాగ్రహం కనిపిస్తుంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేతలు ఆడుకొంటున్నారు.. అనే జేపీ మాటలు కూడా.. తాయిలాలకు ప్రలోభపడి రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న అమాయకపు ఓటర్ల కనువిప్పు కోసం ఉద్దేశించినదే.

అయితే జగన్ సర్కారు తీరుతెన్నులను గమనించిన జయప్రకాశ్ నారాయణ వ్యక్తం చేసిన కొన్ని అనుమానాలు మాత్రం కేవలం విపక్ష కూటమి వారినే కాదు.. సామాన్య ప్రజలను కూడా భయపెట్టేలా ఉన్నాయి. ‘‘అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? లేదా? అనే అనుమానం కలుగుతోందని’’ జేపీ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా? అనే సందేహం ఉందని’’ అంటున్నారు. నిజానికి కొన్ని వర్గాల పరిశీలనను బట్టి.. ఎన్నికల పోలింగ్ నాడు భయాందోళనలు సృష్టించడం ద్వారా.. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడం ద్వారా పోలింగ్ బూత్ లకు ప్రజలు రావడానికే భయపడేలా చేయాలని వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లుగా పుకార్లున్నాయి. ఇప్పుడు జయప్రకాశ్ చేస్తున్న వాదన కూడా అలాంటి పుకార్లకు ఊతమిచ్చేలాగానే ఉంది. మరి.. పోలీసు వ్యవస్థ ఈ అయిదేళ్ల పాటూ ప్రభుత్వానికి కొమ్ము కాసినట్టుగా ఎన్నికల నాడు కూడా వ్యవహరిస్తుందో లేదా, ఈలోగా.. పోలీసు వ్యవస్థ సారథులు మారి, వారి పనితీరులో గుణాత్మక మార్పులు తీసుకువస్తారో వేచిచూడాలి. మొత్తానికి జేపీ మాటలు విపక్ష కూటమికి గొప్ప నైతిక బలాన్ని అందిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories