రాష్ట్రమంతా రాజకీయ పరిస్థితులు అటుఇటుగా మారుతూ ఉండవచ్చు గానీ.. కడపజిల్లాకు సంబంధించినంత వరకు తమ పార్టీకి తిరుగుండదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉండవచ్చు గాక.. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన, వారసత్వంగా రాజకీయ వైభవాన్ని తాను అనుభవించిన, అనుభవిస్తున్న కడప పార్లమెంటు సీటు, పులివెందుల ఎమ్మెల్యే సీటుల్లో ఎంత ఉపద్రవం వచ్చినా సరే.. తమ పార్టీ హవా ఇంచుకైనా తగ్గదని ఆయన అనుకుంటూ ఉండవచ్చు గాక..! కానీ సొంతచెల్లెళ్లు ఇద్దరూ ఇప్పుడు ఆయన మీద ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాల్లా దూసుకువస్తున్నారు. ‘ప్రజాకోర్టులో రాజకీయంగానే ఎదుర్కొందాం’ అనే స్పష్టమైన లక్ష్యంతో ఎన్నికల్లో జగన్ మీద తలపడడానికి ఆ చెల్లెళ్లిద్దరూ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి మరణించి అయిదేళ్లు అయిన సందర్భంగా కడపలో నిర్వహించిన వర్ధంతి సభ, ఆద్యంతం రాజకీయ సభలాగానే జరిగిందంటే అతిశయోక్తి కాదు. హత్యకు అసలు సూత్రధారి, హంతకులను కాపాడే వ్యక్తిగా జగన్ ను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో చెల్లెళ్లిద్దరూ తమ ప్రసంగాల్లో సమరశంఖాన్ని పూరించారు.
‘‘మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాను మీరు మరచిపోయాకరా? అన్నం పెట్టిన చేతిని నరకడం దారుణం కాదా? ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను చూస్తున్నాం’’ అంటూ వివేకా కుమార్తె సునీత నిప్పులు చెరిగినది అన్నయ్య జగన్ మీదనే! ‘‘తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు.. చంపినవాళ్లు, చంపించిన వాళ్లు.. వాళ్లను కాపాడుతున్న వాళ్లు మరోవైపు ఉన్నారు.. ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారు’’ అని సునీత ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆమె చాలా బ్యాలెన్స్‌డ్ గా మాట్లాడారు. జగన్ చంపించారని అనడం లేదు. పేర్లు ప్రస్తావించకపోయినా అవినాష్ రెడ్డి చంపించాడని, ఆయనను కాపాడడానికి జగన్ కాపాడుతున్నారని.. ఆమె మాటలను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
ఇదే సభలో తాను కూడా పాల్గొని సునీతకు స్థైర్యం అందించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా జగన్ మీద సూటిగానే ఝధ్వజమెత్తారు. ‘జగనన్నా అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. వైఎస్ఆర్ తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా? మీరేం చేస్తున్నారు. అయిదేళ్లు గడిచినా ఎందుకు న్యాయం జరగలేదు. చిన్నాన్నకే ఇలా అయితే సామాన్యుల సంగతేంటి?’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు.
మొత్తానికి ఈసారి కడప, పులివెందుల రాజకీయ బరుల్లో వాతావరణం వేడిగా ఉండబోతున్నది. జగనన్న, ఆయన ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డిల మీద.. ఈ ఇద్దరు చెల్లెళ్లు తలపడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి వారు దుర్మార్గులని ప్రచారం చేస్తున్న వీరు విజయం సాధిస్తారో లేదో చూడాలి. విజయం సాధించకపోయినా.. వారి మెజారిటీలకు గండికొట్టగలిగినా కూడా.. ప్రజలు వీరి వాదనను అంగీకరించినట్టేనని, పలువురు భావిస్తున్నారు.