జగన్ చెప్పే కాశీమజిలీ కథలు చెల్లవిక!

చెప్పేవాడికి వినేవాడు లోకువ అని సామెత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సామెతకు అతీతమైన వ్యక్తి ఎంతమాత్రమూ కాదు. తాను ఏం చెప్పినా సరే.. ప్రజలు నోర్లు వెళ్లబెట్టుకుని వింటున్నారు గనుక.. తనకు తోచినదెల్లా చెప్పడాన్ని ఆయన అలవాటు చేసుకున్నారు. అయిదేళ్ల పరిపాలన కాలంలో తాను ఏం చేస్తే అది మహాద్భుతం అని టముకు వేసుకోవడం ఆయనకు మామూలైపోయింది. కానీ పగ్గాలు చేతులు మారిన తర్వాత.. ఆయన చేతల మీద నిఘానేత్రాన్ని తెరచి చూసినప్పుడు.. ఆయన పాపాలన్నీ బయటపడుతున్నాయి. ఏ లిక్కర్ విధానం ద్వారా అయితే.. సర్కారు ఖజానాకు ఆదాయం పెంచానని జగన్మోహన్ రెడ్డి గతంలో డబ్బా కొట్టుకున్నారో.. ఆ లిక్కర్ విధానాన్ని తమ స్వాహాలకోసమే రూపొందించారనే సంగతి ఇప్పుడు బట్టబయలు అవుతోంది.

జగన్ తీసుకువచ్చిన లిక్కరు విధానం ద్వారా జరిగిన కార్యకలాపాలపై రాష్ట్రప్రభుత్వం సీఐడీ ద్వారా దర్యాప్తు చేయించింది. సుదీర్ఘమైన దర్యాప్తు తర్వాత.. వారు విస్మయానికి గురిచేసే అనేక వాస్తవాలను బయటకు తెచ్చారు. జగన్ హయాంలో మద్యం ముడుపులను బిగ్ బాస్ కు చేరవేయడానికి పెద్ద హవాలా నెట్ వర్క్ నడిపించినట్టు తేల్చారు. మద్యం తయారుచేసే డిస్టిలరీలను బెదిరించి, లొంగదీసుకుని ఎవరు ఎంత వాటాలు ఇవ్వాలో తామే డిసైడ్ చేసి.. ఆమేరకు వసూళ్లు సాగించిన వైనం మొత్తం బయటకు తీశారు. మొత్తంగా అయిదేళ్ల పదవీకాలంలో మూడువేల కోట్లకు పైగా కొల్లగొట్టినట్టుగా లెక్క తేల్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. హోదా ఐటీ అయినప్పటికీ ఆయన బాధ్యత మొత్తం లిక్కరు దందా మాత్రమే. డిస్టిలరీల నుంచి అనేక అంచెల్లో వాటాలు వసూలు చేయడం.. వాటిని మిధున్ రెడ్డికి చేరవేయడం ఆయన బాధ్యత. ఆ సొమ్మును జగన్ కు చేరేలా చూసుకోవడం మిధున్ రెడ్డి బాధ్యత. ఈ రకంగా.. వాటాలు పంచుకోవడంలో బాధ్యతలు పంచుకుని వీరు పనిచేసినట్టుగా సీఐడీ లెక్క తేల్చింది.

జగన్ తన దొంగ మార్గాలను ఎవరూ గుర్తించరు అనుకున్నారో ఏమో గానీ.. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కొత్త లిక్కర్ పాలసీ తెచ్చినప్పుడు.. తన పాలసీ గొప్పదంటూ విమర్శలు చేశారు. మా హయాంలో అవే కంపెనీలు, ఇప్పుడూ అవే కంపెనీలు.. నాణ్యత ఎలా పెరుగుతుంది అని ప్రశ్నించారు? చూడబోతే.. జగన్ కు కప్పం కట్టవలసిన పని లేదు గనుక.. నాణ్యత పెరిగిందని అనుకోవాలి. తను గొప్ప పాలసీ తెచ్చానంటూ రకరకాల కాశీమజిలీ కథలు చెప్పేవారు జగన్. చంద్రబాబు విధానాన్ని విమర్శించడానికి సాహసించారు. ఇకపై ఆయన కథలు చెల్లుబాటు కాకపోవచ్చు. సీఐడీ దర్యాప్తులో చాలా విపులంగా వాస్తవాలు బయటపడ్డాయి. ఇక బుకాయించడం వర్కవుట్ కాదని.. విచారణకు హాజరు కావడానికి, తదనంతర పరిణామాలకు కూడా మానసికంగా సిద్ధపడి ఉండాలని జగన్ తెలుసుకోవాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories