అధికార్ల మెడకు చుట్టుకుంటున్న విజయసాయి పాపాలు!

‘వారి వ్యవహారాలతో నాకు ఏమాత్రం సంబంధం లేదు.. నా కుమార్తెకు పెళ్లి చేసి పంపిన తర్వాత ఆమె వారి ఇంటి బిడ్డ.. వారి వ్యాపార వ్యవహారాలలో నేను ఎన్నడూ తల దూర్చను.. పట్టించుకోను..’ అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా సందర్భాలలో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. ఆయన ఎంత చెప్పుకున్నప్పటికీ.. వైఎస్ జగన్ పాలన కాలంలో.. విజయసాయిరెడ్డి స్థాయి వ్యక్తి అండ, జోక్యం లేకుండానే ఆయన కూతురు.. ఏకంగా బంగాళాఖాతం సముద్ర తీరాన్ని కూడా ఆక్రమించేసుకోడానికి దందా నడిపిస్తుందా? అనేది సామాన్య ప్రజలకు కలిగే సందేహం.

సముద్ర తీరంలో  నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టడమే కాదు.. తీరంలోకి చొచ్చుకుపోయి సాగించిన కాంక్రీటు నిర్మాణాల వ్యవహారంపై హైకోర్టు చాలా చాలా సీరియస్ అవుతోంది. ఇప్పుడు ఆ వ్యవహారం ఎంతవకు ముదిరిందంటే.. ఆ నిర్మాణాల తీవ్రతను గమనించిన న్యాయస్థానం.. ఇందుకు బాధ్యులైన అధికారులందరి పేర్లు తమకు ఇవ్వండి.. వారందరి మీద చర్యలకు ఆదేశిస్తాం అంటూ హూంకరిస్తోంది. విజయసాయి ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినప్పటికీ.. అధికారులు కూడా కోర్టుకు రావాల్సిన పరిస్తితే దాపురిస్తే గనుక.. తెరవెనుక ఆయన పాత్ర ఎంత ఉన్నదో కూడా బయటకు వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.

విజయసాయిరెడ్డి కూతురు పెనక నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ కంపెనీ విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటూ కళ్లు మూసుకుంటార? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడి అక్రమ కాంక్రీటు నిర్మాణాలను తొలగించి తీరాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత.. అధికారులు వాటిని బయటకు కనిపించే వరకు తొలగించారు. దీనిపై మళ్లీ వ్యాజ్యం దాఖలు కావడంతో కోర్టు మరింత సీరియస్ అయింది. అధికారులపై పూర్తిగా పునాదుల్లో ఉన్నంతవరకు తొలగించాల్సిందిగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అధికారులు తీరంలో లోతుకు తవ్వి కాంక్రీటు నిర్మాణాల్ని మొత్తంగా తొలగించారు. ఈ కాంక్రీటు నిర్మాణాల ఫోటోలను చూసిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

తీరంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వలన.. ఇప్పటిదాకా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరగా నిపుణులను పంపాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జాప్యం చేస్తే అంచనా వేయడం కష్టమవుతుందని కూడా హెచ్చరించింది. పునాదులను తొలగించే ప్రక్రియ కంటిన్యూ చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. తీర ప్రాంతంలో ఏర్పాటైన రెస్టోబార్ల విషయంలో కూడా నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. అదే సమయంలో.. ఈ కాంక్రీటు పునాదుల తొలగింపునకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని కూడా నేహారెడ్డికి చెందిన కంపెనీ నుంచి రాబట్టాలని జీవీఎంసీ కమిషనర్ ను ఆదేశించడం విశేషం.
అధికారం తమ చేతిలో ఉన్నది కదాని, అధికారులను తాము బెదిరించగలం కదా అని.. విర్రవీగుతూ.. నిబంధనలను ఉల్లంఘించి పాపాలకు పాల్పడితే.. ఎప్పటికైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని.. విజయసాయి కూతురు నేహారెడ్డి వ్యవహారం చాటిచెబుతోందని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories