మేం ఆల్రెడీ బటన్లు నొక్కేశాం.. ఇవన్నీ కొత్త పథకాలు ఏం కాదు.. అర్జంటుగా డబ్బులు వారి ఖాతాల్లోకి వేసేయకపోతే పాపం వాళ్లు చాలా ఇబ్బందులు పడతారు.. అంటూ సరిగ్గా పోలింగ్ కు రెండు రోజుల ముందు మొసలి కన్నీరు కార్చారు. రెండునెలలు ఖాళీగా కూర్చుని.. ఇప్పుడొచ్చి అర్జంటుగా డబ్బులు వేయాలంటే కుదర్తు.. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉన్నట్టు కాదు.. కాబట్టి పోలింగ్ అయిపోయాక డబ్బు వేసుకోండి అని ఈసీ ఆదేశిస్తే.. అదేదో నేరం అయినట్టుగా కోర్టును ఆశ్రయించారు. 13వ తేదీకి ముందే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేయాలని నానా యాగీ చేసేశారు. కానీ కోర్టు కూడా ఆపింది. అప్పుడు ఊరుకుండిపోయిన అధికారులు ఇప్పటిదాకా మళ్లీ నోరు మెదపడం లేదు. ఎన్నికలు పూర్తయి మూడు రోజులు గడుస్తున్నా.. విద్యార్థుల ఖాతాల్లోకి విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయడం గురించి పట్టించుకోవడం లేదు. విద్యార్థుల కన్నీళ్ల పాపం మోయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనా? లేదా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డినా? అనే వ్యాఖ్యానాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం వద్ద 14 వేల కోట్లరూపాయలకు పైబడి నిధులు ఉన్నాయి గానీ.. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నొక్కేసిన బటన్లకు సంబంధించి కూడా పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలంటే మనసురావడం లేదని అంటున్నారు. పోలింగుకు ముందు నిధులు విడుదల తక్షణం చేయాలని హడావుడి చేసిన వ్యక్తులు, పోలింగ్ తర్వాత ఇవ్వడానికి ఈసీ పరంగా అభ్యంతరాలు లేకపోయినా పట్టించుకోవడం లేదు.
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన నాలుగు క్వార్టర్లకు కలిపి 2832 కోట్లరూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రావాలి. జగన్ ఒక క్వార్టర్ కు సంబంధించి మాత్రం బటన్ నొక్కారు. అది కూడా ఇంకా డబ్బు పడలేదు. దీంతో మొత్తం ఆ భారమంతా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం మీదికే వెళ్లిపోతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. గతంలో నేరుగా కళాశాలల యాజమాన్యాలకే ఫీజులు చెల్లిచేవారు. జగన్ వచ్చిన తర్వాత.. కాలేజీలకు ఇవ్వకుండా తల్లులకు ఇచ్చి.. వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ నిధులు ఇవ్వకపోవడం వల్లన కాలేజీ యాజమాన్యాలు పిల్లలను పరీక్ష కూడా రాయనివ్వడం లేదు. గతంలో అయితే.. ఫీజులు ఆలస్యం అయినా సరే.. నేరుగా తమ ఖాతాకే వస్తాయి గనుక.. యాజమాన్యాలు పిల్లలను ఇబ్బందిపెట్టేవారు కాదు.. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. దానికి తగ్గట్టుగా పోలింగ్ ముగిసిపోయింది గనుక.. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతున్నారు. ప్రభుత్వ దుశ్చర్య వలన వందల మంది పీజీ విద్యార్థులు ఇంకా సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు. వేల మంది పరీక్షలు రాయడం అనేది డౌటుగా మారుతోంది. విద్యార్థులను ఇలా వేధిస్తున్న పాపాలు ముఖ్యమంత్రి జగన్ ఖాతాలోకి వెళతాయా? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఖాతాలోకి వెళతాయా? అని ప్రజలు నిలదీస్తున్నారు.