కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ డీల్.. అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. మామూలుగా గ్రాములు, మిల్లీగ్రాముల్లో డ్రగ్స్ దొరికితేనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అవుతూ ఉంటాయి. అలాంటి ఒక కంటైనర్ నిండా బ్రెజిల్ నుంచి వచ్చిన సరుకులో ఎన్ని వేల కిలోలు డ్రగ్స్ ఉన్నాయో ఇంకా లెక్క తేలలేదు. ఎన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందో ఇంకా లెక్క తేలలేదు. ఈ దందా బయట పడగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల దళాలు, మీడియా సంస్థలు, పార్టీవారు అందరూ కూడా ఆ పాపాన్ని తెలుగుదేశం మీదికి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
ఏ సంధ్యా ఆక్వా పేరు మీదనైతే కంటైనర్ వచ్చిందో.. ఆ కంపెనీ యజమాని వీరభ్రదరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వైసీపీ దళాలకు బాగా కలిసి వచ్చింది. దగ్గుబాటి పురందేశ్వరి వియ్యంకులతో ఏదో ఒక వ్యాపారంలో ఈ వీరభద్రస్వామి కూడా భాగస్వామి. అంతే.. ఇక గోబెల్స్ ప్రచారాలకు హద్దేముంటుంది. పురందేశ్వరి కొడుకుతో ఆ యజమానికి సంబంధాలు ఉన్నాయని, నారా, నందమూరి కుటుంబాలతో కూడా సంబంధాలు ఉన్నాయని, ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక వారందరి హస్తమూ ఉన్నదని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించేశారు.
నిజానికి డ్రగ్స్ మోసుకు వచ్చిన కంటైనర్ షిప్ ఈ నెల 16నే విశాఖకు చేరింది. ఇంటర్ పోల్ నుంచి తమకు సమాచారం అందడంతో సీబీఐ అధికారులు ఈనెల 18న విశాఖకు చేరుకున్నారు. అప్పటినుంచీ హైడ్రామా మొదలైంది. ఒకసారి కేసులోకి సీబీఐ ఎంటరైన తర్వాత.. తమకు సంబంధం లేకపోయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు రంగప్రవేశం చేశారు. అసలు శాంపిల్స్ ను తనిఖీ చేయడానికే అడ్డుపడ్డారు. యంత్రాంగాన్నంతా అక్కడకు తరలించడంలో వైసీపీ పెద్దల ప్రమేయం ఉన్నదని పుకార్లున్నాయి. నిజానికి ఒకవైపు సీబీఐ అధికారులు ఢిల్లీనుంచి తమ వెంట తెచ్చుకున్న ప్రత్యేకమైన కిట్ లతో చెక్ చేస్తుండగా, స్థానిక అధికారులే అడ్డుపడ్డారు. వర్షం వస్తే అంతా పాడైపోతుందని, చెకింగ్ ఆపి మొత్తం కంటైనర్లలోనే పెట్టి సీలు వేసుకోవాలని అన్నారు. ఇదంతా ఇలా జరగగా.. దాని వెనుక తెలుగుదేశం హస్తం ఉందన్నట్టుగా వైసీపీ చేస్తున్న ప్రచారం మరీ హేయంగా ఉంది.
చంద్రబాబుకు మాత్రమే కాదు.. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిపోయి నరసరావు పేట ఎంపీగా మళ్లీ బరిలో ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలును కూడా ఇందులో ఇరికించేందుకు వైసీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. తెదేపాలో తమకు కిట్టని వారికందరికీ ఈ డ్రగ్స్ తో ముడిపెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుందేమోనని జనం అనుకుంటున్నారు.