వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఎంపీగా కూడా ఉంటూ.. ఈ దఫా పార్టీకి వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీ బరినుంచి ప్రజాక్షేత్రంలో పోటీచేస్తున్న విజయసాయిరెడ్డికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఆయనకు ప్రచారం చేస్తున్న క్షణంలోనే అర్థమైపోతోంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే బలమైన నాయకులు పార్టీకి దూరమయ్యారు. తప్పదు గనుక.. పార్టీ కొత్త అభ్యర్థులను మోహరించింది. పార్టీగ్రాఫ్ ప్రజల్లో దారుణంగా పడిపోయి ఉంది. విజయసాయి వంటి సీనియర్ నాయకుడు.. ఎంపీ అభ్యర్థి ప్రచారానికి వెళితే.. డబ్బులిచ్చి మరీ సభకు తీసుకురాబడిన జనం.. డబ్బు చేతిలోపడగానే వెళ్లిపోతున్నారు. విజయసాయం ప్రసంగించకముందే వెళ్లిపోతున్నారు. భోజనాలు కూడా ఉన్నాయి.. దయచేసి వెళ్లొద్దు అని బతిమాలుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.
కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత. విజయసాయిరెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. జీవితంలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగిన ఈ కీలక నాయకుడు.. ఓడిపోబోతున్నారనే సంకేతాలు ప్రచారం సమయంలోనే కనిపిస్తున్నాయి. ఉదయగిరిలో చోటు చేసుకున్న ఈ సంఘటన చాలా కీలకమైనది. ‘పెద్దాయన మాట్లాడుతున్నారు.. దయచేసి వెళ్లకండి.. అందరికీ భోజనాలున్నాయి..’ అని మాత్రమే కాదు. చెప్పినందుకైనా ఆగండి. వెనక్కి రండి. మీరు పోవద్దు అంటూ దాదాపుగా బతిమాలుతూ వాహనం మీదినుంచి మైకులో అరిచినా సరే మహిళలు పట్టించుకోలేదు.
నెల్లూరు జిల్లా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా పట్టం కట్టింది. ఆ జిల్లాను పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ జగన్ అనుకునే పథకాలు తప్ప.. జిల్లాలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగకపోవడంతో ప్రజల్లో ఆదరణ దిగజారింది. తమ తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు జరిపించుకోవడానికి కూడా.. జగన్ చుట్టూ వందసార్లు తిరిగినా.. ఫలితం లేకపోవడంతో.. నాయకులు కూడా ఆ పార్టీని వదలిపెట్టారు. చివరికి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీకి ఎంతో కీలక నాయకుడు అయిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని ప్రకటిస్తే.. ఆయన అభ్యర్థిత్వాన్ని వదులుకుని తెలుగుదేశంలోకి వెళ్లిపోయి ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. దీంతో వేరే గత్యంతరంలేక, ఎంపీగా పోటీచేయడానికి తగిన అభ్యర్థి మరొకరు లేక.. రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డిని తీసుకువచ్చి బరిలో దింపారు. ఆయన ప్రచారంలోనే ఇలాంటి పదనిసలు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆయనను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. జగన్ కు కీలక అనుచరుడిగా సొంత పార్టీ నాయకులందరినీ ఓ ఆటాడుకుంటూ ఉండే విజయసాయిరెడ్డి.. ప్రజలు తనను ఈ స్థాయిలో తిరస్కరిస్తోంటే ఖంగుతింటున్నారు.