వంగా గీత ఆఫీసు ముట్టడి వెనుక అసలు సీక్రెట్ ఇదే!

పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించి తీరుతానని ప్రతిజ్ఞలు చేసిన వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎక్కడున్నారు? పోలింగుకు కొన్ని గంటల ముందుగా ఆమె నియోజకవర్గం నుంచి హఠాత్తుగా మాయం అయిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమి సంకేతాలు తొలినుంచి కనిపిస్తున్నవే అయినప్పటికీ.. ప్రచారం ముగిసిపోయి డబ్బు కట్టలతో జనంలోకి వెళ్లే సమయానికి ఓటమి గ్యారంటీ అని కళ్లముందు ఆమెకు స్పష్టంగా కనిపించినట్టుగా చెబుతున్నారు. దీంతో ఆదివారం సాయంత్రానికే వంగా గీత పిఠాపురంలో తాత్కాలికంగా తీసుకున్న కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారని సమాచారం.
తమాషా ఏంటంటే.. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పిఠాపురంలో చాలా చోట్ల పోలింగ్ ఏజంట్లు కూడా దొరకని పరిస్థితి. గట్టి కార్యకర్తలు అనుకున్న వారిని తొలుత పోలింగ్ ఏజంట్లుగా నిర్ణయించారు. అయితే వారంతా చివరి నిమిషంలో మొహం చాటేశారు. సరైన పోలింగ్ ఏజంట్లు లేరు. అప్పటికే వంగా గీత కార్యాలయానికి తాళం పెట్టేశారు. పిఠాపురంలో అధికార పార్టీకి అసలు పోలింగ్ ఏజంట్లు కూడా దొరకలేదంటే పరువు పోతుందని.. అప్పటికప్పుడు సిటింగ్ ఎమ్మెల్యే, టికెట్ దక్కనందువల్ల అసంతృప్తితో ఉన్న పెండెం దొరబాబునేబతిమిలాడారు. అనుకున్న వారిని కాకుండా.. ఎవరో ఒకరు పోలింగ్ ఏజంటుగా కూర్చొంటే చాలు అనే స్థితిలో మనుషుల్ని పురమాయించారు.
ఈ పరిస్థితుల్లో ఆదివారం నాడు వంగా గీత కార్యాలయాన్ని తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ జనం ముట్టడించడం వెనుక అసలు సీక్రెట్ కూడా బయటకు వచ్చింది. వంగా గీత గెలుపుకోసం భారీగానే డబ్బు పంపిణీకి సిద్ధపడ్డారు. దానికి తగ్గట్టుగా ఆమెకు పవన్ను ఓడించడం కోసం పార్టీనుంచి కూడా నిధులు భారీగా వచ్చినట్టు సమాచారం. అయితే కొంతమేరకుపంచిన తర్వాత.. ఎంత పంచినా దండగే గెలిచేది లేదు.. అని ఆమెకు అర్థమైనట్టుగా చెబుతున్నారు. దాంతో డబ్బులు పూర్తిగా పంచకుండా ఆపేసి, అక్కడితో మమ అనిపించినట్టు సమాచారం. కొందరికి ఇచ్చి, కొందరికి ఇవ్వకుండా వాళ్లు జాగ్రత్తపడగా.. జనం మాత్రం ఆమె ఆఫీసును ముట్టడించి డబ్బు కోసం గోల చేశారు. అప్పటికప్పుడు పోలీసుల్ని పిలిపించి జనాన్ని చెదరగొట్టి ఏదో గండం దాటారు. మొత్తానికి ఓటమి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపించడం వంగా గీతకే కాదు, రాష్ట్రంలోర చాలా మంది వైసీపీ వారికి జ్ఞానోదయం చేసినట్లుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories