క్రిస్టియన్ మత ప్రచారకుడు కెఎ పాల్ కు రాజకీయ కమెడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్ప గుర్తింపు ఉంది. ఆయన మాటలు విన్న ప్రతిసారీ.. విన్న ప్రతి ఒక్కరికీ ఆయన మానసిక స్థితి మీద సందేహాలు కలుగుతూనే ఉంటాయి. ఆ అనుమానంతోనే వారు నవ్వుకుంటూ ఉంటారు. అలాంటి కమెడియన్ ఇప్పుడు ఇంకా కామెడీకి తెరలేపి తన పరువు తానే తీసుకున్నారు. హిందువులకోసం 30 లక్షల జనాభాతో తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎపాల్ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తొలిరోజే కోర్టు కొట్టేసింది. సుప్రీంలో పిటిషన్ వేయడం మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా హాజరై తానే తన వాదనలు వినిపిస్తానంటూ.. ఆయన కామెడీ పర్వాన్ని ప్రారంభించిన వెంటనే.. న్యాయమూర్తులు కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించేశారు. చట్టాలను సవరించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు మాత్రమే ఉంటుందని.. వాటిలో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు పేర్కొంటూ కేసును కొట్టేశారు.అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతున్నదని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కల్తీ వ్యవహారంపై అయిదుగురు సభ్యల సెట్ దర్యాప్తు ప్రారంభించనుంది. ఈ దర్యాప్తుకు గడువు విధించాలని కూడా కెఎ పాల్ కోరారు. ఈ పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
అయితే తనను తాను ప్రపంచంలోని దాదాపు 200 దేశాలకు పైగా దేశాధిపతులను ఆశీర్వదించిన, వారితో కాళ్లు మొక్కించుకుని అతిగొప్ప క్రిస్టియన్ మతప్రచారకుడిగా చెప్పుకునే ఈ కెఎ పాల్.. హిందూ ధర్మం విషయంలో, తిరుమల వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నట్టు. విదేశీ నిధులతో తాను నడిపే క్రిస్టియన్ మెషినరీలకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల విదేశీ నిధులు వస్తున్న రోజుల్లో ఆయన వాటిని కేంద్రప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువెళ్లడానికి ఏమైనా ఆలోచించారా? అనే అనుమానాలు రావడం సహజం.
అయితే కేవలం పాపులారిటీ కోసం, స్పైసీ మాటలు మాట్లాడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలవడం కోసమే జీవిస్తున్నట్టుగా మాట్లాడే కెఎపాల్ తాను తెరమరుగు కాకుండా ఉండడానికే ఈ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ ద్వారా కొంతకాలం వార్తల్లో నిలవొచ్చు అనుకున్నారుగానీ.. కోర్టు కొట్టేసింది. పైగా టీటీడీ ఛైర్మన్ గా టీవీ 5 అధినేత బిఆర్ నాయుడు అవుతారని తెలిసే ఆయనను ఇరుకున పెట్టడానికి కెఎపాల్ ఇలాంటి పిటిషన్ వేసి ఉంటారని కూడా కొందరు అంటున్నారు. కెఎపాల్ కామెడీలను ప్రోత్సహించని టీవీ ఛానెల్ అధినేత గనుక.. బిఆర్ నాయుడు పట్ల ఆయనకు అసంతృప్తి ఉన్నదని అందుకే ఇలాంటి పిటిషన్ వేశారనే వాదన కూడా ఉంది.