పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతోంది. వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో, అలాగే వారంలో మధ్యలో రిలీజ్ కావడంతో తొలుత ఈ సినిమా బిజినెస్ కొంత నెమ్మదిగా సాగింది. కానీ వీకెండ్ వచ్చే సరికి పర్వాలేదు అన్నట్లుగా ఓ మోతాదులో జనం థియేటర్లకు వచ్చారు.
ఇక సినిమా విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే రెండో భాగానికి సంబంధించిన కొన్ని అసంతృప్తి గళాలు వినిపించాయి. మరిచేపోయి టికెట్ ధరలు కూడా కొంతమంది ప్రేక్షకులకు ఆలోచనలో పడేశాయి. అయితే అసలైన పరీక్ష మాత్రం ఇప్పుడు మొదలు కానుంది. సోమవారం నుంచి మళ్లీ వర్కింగ్ డేస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సినిమా స్టామినా ఇక్కడే పరీక్షలో పడనుంది.
అయితే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే.. సోమవారం నుంచి ఈ చిత్రానికి ఉన్న స్పెషల్ రేట్లు పూర్తిగా తగ్గించారు. కేవలం సాధారణ ధరలకే టికెట్లు దొరుకుతుండటంతో, మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాదు, మూవీలో కొన్ని చిన్నచిన్న మార్పులు కూడా చేసినట్టు సమాచారం. కథలో కొంత ఫ్లో మెరుగుపరచేలా కంటెంట్ అప్‌డేట్ చేశారని టాక్.
ఈ మార్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా..? టికెట్ ధర తగ్గించడమే సరిపోతుందా..? అనే విషయాలు తేలబోయే రోజు ఈరోజే. సినిమా భవిష్యత్తు ఈ వర్కింగ్ డేస్ రన్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి హరిహర వీరమల్లు నిజంగా నిలబడుతాడా లేక వెనకడుగు వేస్తాడా అనేది చూడాలి.