తప్పులు దిద్దుతూ.. వడిగా ముందడుగులు!!

అమరావతి రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వడివడిగా ముందడుగులు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి సర్కారు చేతకానితనం, అచేతనత్వం కారణంగా స్తంభించిపోయిన అమరావతి నిర్మాణం.. ఇప్పుడు రెట్టించిన వేగంతో ముందుకు సాగడానికి సర్కారు కసరత్తు చేస్తున్నది. వివిధ సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి నిర్మాణాలు చేపట్టడానికి తీరిపోయిన గడువు ఒప్పందాలను ఇప్పుడు పొడిగిస్తున్నారు. సి ఆర్ డి ఏ అధికారులు ఆయా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడి నిర్మాణ పనులు ప్రారంభించడం గురించి చర్చిస్తుండడం గమనార్హం. ఇదే ధోరణిలో పనులు సాగితే అమరావతి రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేగంగా పడతాయని అందరూ అంచనా వేస్తున్నారు. 
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే అర్థం లేని కాన్సెప్ట్ తో అమరావతిని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో 131 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయించారు. అయితే ఆ సంస్థలకు కావాల్సిన కనీస వసుతులపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఎస్ఆర్ఎం, విట్, ఎన్ఐడి, అమృత వంటి విద్యాసంస్థలు మాత్రం తమ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభించాయి. కానీ రోడ్లు తాగునీరు తదితర సౌకర్యాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వీటిని చూసి మిగిలిన సమస్యలు నిర్మాణాలకు ముందుకు రావడానికి జంకాయి. జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలించదలచుకున్నప్పటికీ, అమరావతి ప్రాంతంలో అప్పటికే మంజూరైన నిర్మాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పన చేపట్టి ఉంటే ఈ ఐదేళ్లలో ఇంత ఘోరంగా అమరావతి పరిస్థితి స్తంభించి ఉండేది కాదు. కానీ అమరావతి రాజధాని మీద కక్ష కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారు. 
అమరావతి నిర్మాణం అనేది తన చేతుల మీదుగా పూర్తయినా సరే.. అసలు అక్కడ నగరం ఎప్పటికి ఏ రూపంలో ఏర్పడినా సరే.. క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే దక్కుతుందని జగన్మోహన్ రెడ్డి అసూయతో, ఓర్వలేనితనంతో రగిలిపోయారు. అందుకే అంత కక్షపూరితంగా.. అన్నింటినీ అలా వదిలేసి.. తుమ్మచెట్ల చిట్టడివిలా ఆ ప్రాంతం మారడానికి కారకులయ్యారు.  
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భూములు పొందిన సంస్థలను వచ్చి నిర్మాణాలు చేపట్టాల్సిందిగా సి ఆర్ డి ఏ అధికారులు చర్చిస్తున్నారు. పైగా వారితో ముగిసిపోయిన ఒప్పందాల గడువును కూడా పొడిగిస్తున్నారు. దీనివల్ల ఆయా సంస్థలు ముందుకు వచ్చి ముమ్మరంగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories