పోలీసులూ.. ఉపేక్ష, విచ్చలవిడితనం సాగవిక!

రాష్ట్రంలో ఇప్పుడు జగనన్న రాజ్యం నడుస్తున్నదని అనుకోవడానికి వీల్లేదు. ఒకసారి ఎన్నికల షెడ్యూలు ప్రకటించబడిన తరువాత.. జగనన్న కేవలం అలంకార ప్రాయంగా ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాల్సిందే. అంతే తప్ప అన్ని ప్రభుత్వ విభాగాల మీద మునుపటిలాగా పెత్తనం చేస్తానంటే కుదరదు. తమ అనుంగు అనుచరులను, అభిమానులను వివిధ శాఖల్లో ముందే నియమించుకుని ఉంటే తప్ప.. మునుపటిలాగా ఇప్పుడు జగన్ వారిని శాసించలేరు. అలాంటి వారు ఉన్నా కూడా.. ఎన్నికల కమిషన్ నిబంధనలను మీరి ప్రవర్తించేలా చెలరేగలేరు. ఎందుకంటే అలాచేస్తే వారిమీదనైనా వేటు పడితీరుతుంది. అందరికంటె ముందుగా ఈ విషయాన్ని పోలీసులు తెలుసుకోవాల్సి ఉంది.

ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని, జగన్ మరియు ఆయన సలహాదారుల మాటలే చట్టంగా, సీఆర్పీసీ సెక్షన్లుగా పనిచేయడానికి పోలీసులు అలవాటు పడ్డారని అనేక విమర్శలున్నాయి. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని తెలుగుదేశం, జనసేన నాయకులు ఎన్ని సందర్భాల్లో ఎంతెంత తీవ్రంగా విమర్శించారో లెక్కేలేదు. అనేక సందర్భాల్లో ఆవిషయంలో స్పష్టంగా కనిపించేది కూడా. సోషల్ మీడియాలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు కనిపిస్తే చాలు.. ఫార్వార్డ్ చేసినందుకు కూడా.. అరవయ్యేళ్లు దాటిన వృద్ధులను, మహిళలను కూడా అరెస్టుచేసి వేధించిన సందర్భాలున్నాయి. అదేసమయంలో తెలుగుదేశం నాయకురాళ్ల మీద అత్యంత హేయమైన నీచమైన భాషలో సోషల్ మీడియా పోస్టులు పెడితే, ఫిర్యాదులు అందినా కూడా పట్టించుకున్న దిక్కు లేకుండాపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష అభ్యర్థులు అసలు నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితి కల్పించారు. పోలీసులే బెదిరించి, కిడ్నాప్ లు చేసి, నామినేషన్లకు అడ్డుపడ్డారనే ఆరోపణలూ వచ్చాయి.

అయితే ఇప్పుడు రాష్ట్రంలోర పరిపాలన ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంది. మునుపటిలాగానే.. అధికారపార్టీకి విధేయులుగా ఉంటామని అనుకుంటే పోలీసులు దెబ్బతింటారు. ఇప్పటికే తెదేపా కార్యకర్తల హత్యలు జరిగిన, కారు దహనం జరిగిన మూడు జిల్లాల ఎస్పీల పరిస్థితి వేటుకు సిద్ధంగా ఉందని వినిపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి బూర్ల రామాంజనేయులు కూడా తనమీద దాడిజరిగిందని ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అరాచకాల్ని జాగ్రత్తగా అడ్డుకోకపోతే.. పోలీసు అధికార్ల మీద వేటు తప్పదు. అందుకే వారు ముందే జాగ్రత్త పడాలని, కనీసం ఇప్పటినుంచైనా న్యూట్రల్ గా పనిచేయడం నేర్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories