వీగిపోతున్న విష ప్రచారాలు.. రైతన్నలు హేపీ!

రాజధానికోసం అమరావతి ప్రాంత రైతులు చాలా త్యాగాలు చేశారు. తమ నాయకుడు అద్భుతమైన స్వప్నాన్ని సాకారం చేయడానికి.. మీ అందరి సహకారం అవసరం అని అడిగినప్పుడు స్వచ్ఛందంగా.. 34 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా తమకు అభివృద్ధి చేసిన స్థలాలు వస్తాయని అనుకున్నారు. కానీ జగన్ అనే గ్రహణం రాష్ట్రానికి పట్టిన తర్వాత.. వారి ఆశలు అడియాసలయ్యాయి. అదివరకు చేసిన త్యాగాలకు తోడు.. అయిదేళ్లపాటు అలుపెరగని, మడమ తిప్పని పోరాటాలు చేశారు. హైకోర్టు తీర్పుతో కొమ్ములు వంచారు.. అయిదేళ్లు గడిచాక గ్రహణం వీడిపోయేలానూ చేశారు. ఇప్పుడు తాము పొందబోతున్న స్థలాలకు విలువ పెరుగుతున్నదంటే.. వారందరికీ మరింత ఆనందమే కదా? అలాంటి ఆనందానుభూతిలోనే ఉన్నారు ప్రస్తుతం అమరావతి రైతులు. రిటర్నబుల్ ప్లాట్ల విలువ ఇప్పుడు భారీగా పెరిగినదంటూ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే వారికి భరోసా ఇస్తున్నారు.

మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. అమరావతి పురోగతిని కూడా ప్రజలకు వివరించారు. ప్రధాని శంకుస్థాపనతో అమరావతి నిర్మాణ పనులన్నీ శరవేగం సాగబోతున్నాయని చెప్పారు. మూడేళ్లలోనే నగరానికి నిర్దిష్టమైన రూపురేఖలు తీసుకురావడం గురించి వివరించారు. అద్భుత నిర్మాణాలన్నీ సాకారం అవుతాయని అన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్ల ధరలు పెరిగాయని కూడా చెప్పారు.

అమరావతిలో ఎక్స్ టెన్షన్ గా అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ ఆలోచనలు ప్రారంభించగానే.. జగన్ దళాలు వాటి మీద కూడా కుట్రలు ప్రారంభించాయి.  వాటికోసం కూడా లాండ్ పూలింగ్ జరిగితే.. అమరావతి ప్రాంతంలోని భూముల విలువలు పడిపోతాయని కుటిల ప్రచారాలు ప్రారంభించారు. ఆ ప్రచారాలతో అమాయక రైతుల్ని బురిడీ కొట్టించవచ్చునని అనుకున్నారు. కానీ వారి పాచికలు పారలేదు. రైతులు విజ్ఞతతోనే వ్యవహరించారు. నగరానికి ఆనుకునే విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ రావడం వల్ల.. మొత్తం నగరమూ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే మాటలనే నమ్మారు. అందుకే చంద్రబాబు ప్రయత్నాలకు దన్నుగానే నిలిచారు. వారికి తోడు.. కొత్తగా ప్లాన్ చేస్తున్న 44 వేల ఎకరాల ల్యాండ్ పూలింగుకు కూడా రైతుల మద్దతు బాగా లభిస్తోంది. ఇప్పటికే తొమ్మిది వేల ఎకరాలకు పైగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు కూడా. మిగిలిన స్థలానికి కూడా సానుకూల సంకేతాలే ఉన్నాయి. ఇవన్నీ కలిసే.. అమరావతి ఒక మహానగరంగా ఆవిర్భవించనుండడం పట్ల అందరు రైతుల్లోనూ ఆనందాలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories