పైలట్ వస్తున్నాడు.. పాపమెవరిదో తేలుతుందా?

ఒక సంస్థలో ఉద్యోగిగా ఉంటూ.. ఆయన ఏకంగా పరారయ్యేంత సాహసం చేయలేదు గానీ.. విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపినప్పుడు కుదరదంటూ ధిక్కరించారు. కావలిస్తే వర్చువల్ విధానంలో విచారణకు  హాజరవుతానని సన్నాయి నొక్కులు నొక్కారు. నాయకులను కాపు కాసినట్టే.. తనకు కూడా జగనన్న అండ ఉంటుందని అనుకున్నారో ఏమో గానీ.. తలెగరేస్తున్నట్టుగా ప్రవర్తించారు. అలాంటి పప్పులేం ఉడకవు బాబూ అని పోలీసులు హెచ్చరించిన తర్వాత.. మెట్టు దిగివచ్చి నేరులో విచారణకు హాజరవుతున్నారు. జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన గందరగోళానికి సంబంధించి.. ఆరోజు జగన్ వాడిన హెలికాప్టర్ ప్రధాన పైలట్ అనిల్ కుమార్ రామగిరి పోలీసుల ఎదుట విచారణకు బుధవారం హాజరు అవుతున్నారు. పైలట్ విచారణలో ఆ ఉదంతంలో మరికొన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అనుకుంటున్నారు.

జగన్ పాపిరెడ్డి పల్లి పర్యటనకు వెళ్లినప్పుడు హెలిప్యాడ్ వద్ద గందరగోళం నెలకొంది. వైసీపీ కార్యకర్తలను వందలసంఖ్యలో నాయకులు అక్కడకు తరలించారు. వారి మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారిని రెచ్చగొట్టేలా మాట్లాడడం జరిగింది. కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో పోలీసులు గాయపడ్డారు. ఈ మొత్తం గందరగోళంలో.. కార్యకర్తలు హెలికాప్టర్ మీదికి కూడా దూసుకెళ్లడం.. విండ్ షీల్డ్ కొంతమేర స్వల్పంగా దెబ్బతినడం జరిగింది. అయితే పైలట్లు మాత్రం.. వీవీఐపీ ప్రయాణానికి ఇది మంచిది కాదంటూ.. జగన్ ను హెలికాప్టర్ లో బెంగుళూరు తీసుకువెళ్లడానికి నిరాకరించారు. జగన్ రోడ్డు మార్గంలో వెళ్లిన కాసేపటికే వారు హెలికాప్టర్ లో వెళ్లిపోయారు. ఇది వివాదాస్పదం అయింది. హెలికాప్టర్ చక్కగా వెళ్లగలిగినప్పుడు జగన్ ను ఎందుకు తీసుకెళ్లలేదు అంటూ పోలీసులు పైలట్ లను ప్రశ్నించారు.

నిజానికి హెలికాప్టర్ దెబ్బతినేలా ప్రభుత్వం కుట్ర చేసిందని, జగన్ ను రోడ్డు మార్గంలో వెళ్లే పరిస్థితి సృష్టించి.. ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కేవలం వారు చేసిన ఆరోపణల వల్ల.. అసలు హెలికాప్టర్ ఎందుకు దెబ్బతిన్నదో, ఎంత మేర దెబ్బతిన్నదో మొత్తం సాకల్యంగా తెలుసుకోవాలని పోలీసులు అనుకున్నారు. అయితే.. జగన్ ను తీసుకెళ్లడానికి నిరాకరించిన ప్రధాన పైలట్ అనిల్ కుమార్ మాత్రం విచారణకు రాకుండా సాగదీశారు.

అసిస్టెంట్ పైలట్ తన న్యాయవాది సహా విచారణకు వచ్చి వెళ్లారు. ఏప్రిల్ 16, మే 2 తేదీల్లో విచారణకు రావాలని అనిల్ కుమార్ కు నోటీసులిచ్చినా అతను రాలేదు. వర్చువల్ గా హాజరవుతానని అనగా పోలీసులు ఒప్పుకోలేదు. దాంతో తాజా నోటీసుల ప్రకారం అనిల్ కుమార్ బుధవారం విచారణకు వస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద ఏం జరిగింది. హెలికాప్టర్ కు జరిగిన నష్టమెంత? వాస్తవమేమిటి? జనం ఎలా దాడిచేయడం జరిగింది. మరో హెలికాప్టర్ ఎందుకు తెప్పించలేకపోయారు? వంటి వివరాలు ఆయన ద్వారా పోలీసులు తెలుసుకోనున్నట్టు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories