వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం విధ్వంసం మాత్రమే తన సూత్రంగా పరిపాలన సాగించారని అందరూ విమర్శిస్తూ ఉంటారు. ప్రత్యేకించి అమరావతి రాజధానికి విధ్వంసం అంటే ఏమిటో జగన్మోహన్ రెడ్డి రుచి చూపించారని కూడా అంటూ ఉంటారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టడం ద్వారా తన మొదటి విధ్వంసక క్రీడకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక పెట్టి పని చేసిన పాపాన పోలేదు. 70 శాతం పూర్తయిన నిర్మాణాలను కూడా అలాగే వదిలేసి అమరావతి ప్రాంతాన్ని ఒక స్మశానం లాగా రూపుదిద్దారు. అయితే ఇలాంటి విధ్వంసక పోకడలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చేపట్టిన నిర్మాణం ఒకే ఒక్కటి ఉంది. పాపం జగన్ లేక లేక అమరావతిలో ఒకే ఒక్క నిర్మాణం చేపడితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ ఒక్క నిర్మాణాన్ని కూడా కూలగొట్టారు. ఇంతకూ అదేమిటబ్బా అనుకుంటున్నారు కదా! వివరాల్లోకి వెళదాం…
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానులు కాన్సెప్ట్ తెచ్చి అమరావతిని సర్వనాశనం చేయడానికి తన వంతు ప్రయత్నం ప్రారంభించారు. ఆయన దుర్మార్గపు పోకడలకు నిరసనగా అమరావతి రాజధాని నిర్మాణాలకు తమ భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు కూడా ప్రారంభించారు. అయితే రైతులు తమ పోరాటాలలో భాగంగా తమ నిరసనను, అసంతృప్తిని తెలియజేసేందుకు అసెంబ్లీకి రావడం కూడా జరిగింది. ఆగ్రహించిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వద్దకు అమరావతి రైతులు రాకుండా ఉండేందుకు శాసనసభకు ఉన్న రెండో ద్వారాన్ని మూసివేయించారు. దానికి అడ్డుగా ఒక బలమైన గోడను కూడా నిర్మించారు. అమరావతి ప్రాంతంలో జగన్ చేపట్టిన నిర్మాణం అదొక్కటే. ప్రజలు వారి సమస్యలను బాధలను చెప్పుకోవడానికి అనుమతించకుండా వారిని అసలు దగ్గరికే రానివ్వకుండా చేసిన దుర్మార్గపు ప్రయత్నం ఈ గోడ. దీనితో అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూత వేయించారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాజాగా తన ఆదేశాలతో ఆ గోడను కూలగొట్టించి అసెంబ్లీ రెండో గేటును కూడా తెరిపించారు. ‘‘ప్రజలు వారి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు ప్రజలకు ఎప్పుడూ తెరిచే ఉండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఇది ప్రజల అసెంబ్లీ’’ అని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.