రాష్ట్ర విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక అద్భుతమైన రాజధాని ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు అమరావతికి రూపకల్పన చేశారు. ఒక చిన్న ఇంటిని నిర్మించాలంటేనే.. దానికి ఇంజినీర్లతో ప్లాన్లు గీయించడం దగ్గరినుంచి పునాదులు వేయడం వరకు కూడా మనం నెలలకొద్దీ, కాస్త పెద్ద భవంతి అయితే ఏళ్ల కొద్దీ సమయం తీసుకుంటూ ఉంటాం. అలాంటిది యాభై వేల ఎకరాల్లో ఒక మహాద్భుతమైన నగరాన్నే నిర్మించాలని సంకల్పిస్తే అది ఎంత సమయం తీసుకుటుంది? అలాంటి ప్రారంభంలో ఉండే ఇబ్బందులన్నీ అధిగమిస్తూ కీలకమైన కొన్ని నిర్మాణాలను పూర్తిచేసి, కొన్ని నిర్మాణాలను ప్రారంభించి..
చంద్రబాబునాయుడు అమరావతి నగరాన్ని ముందుకు తీసుకువెళుతూ వచ్చారు. ఈలోగా ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటినుంచి అమరావతి మీద పగబట్టినట్టుగా విషం కక్కడం ప్రారంభించారు. ప్రజావేదికను కూల్చడంతోనే తన విధ్వంస పరిపాలనను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి.. చాలా కొద్ది వ్యవధిలోనే.. చురుగ్గా పనులు సాగుతున్న అమరావతి ప్రాంతాన్ని స్మశానంలా తయారు చేసేశారు. తాజాగా, అసలు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అమరావతి గురించి ఎంత అవమానకరంగా, ఎంత చులకనగా మాట్లాడేవారో.. బయటకు వస్తోంది. ఆ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉంటూ, అక్కడ ఇమడలేక తెలుగుదేశంలో చేరిన కొలుసు పార్థసారథి ఆ విషయాలను బయటపెట్టారు. సామాన్యులు మాత్రమే కాదు, తనలాంటి ఎమ్మెల్యేలు కూడా అమరావతి గురించి ప్రశ్నిస్తే.. రాజధానితో మీకేంటి పని.. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడైనా హైదరాబాదు వెళ్లావా, సెక్రటేరియేట్ కు వెళ్లావా అంటూ గేలిచేసేవారని ఆయన అంటున్నారు. రాజధాని గురించి సొంత పార్టీలో ఎవరు ప్రశ్నించినా కూడా వారి నోరు మూయించేందుకే వైసీపీ పెద్దలు ప్రయత్నించేవారని చెబున్నారు.
పార్థసారధి మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో నాటకాలు ఆడుతూ.. ఎవరైనా విదేశాలనుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు వస్తే కనీసం మన రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉందో కూడా చూపించలేని అధోగతికి దిగజార్చిన జగన్ తీరును ఎండగట్టారు. సంస్కారం ఉన్న వారు ఎవ్వరూ ఆ పార్టీలో ఇమడలేరని, అందుకే తాను బయటకు వచ్చినట్టు కూడా ఆయన చెబుతున్నారు.
అయితే జగన్ కేవలం రాజధాని గురించి ప్రశ్నించిన వారిని మాత్రమే కాదు.. రాజధాని కోసం పొలాలు త్యాగంచేసి ఆందోళన చేసిన వారిని గురించి కూడా తన విషపు సోషల్ మీడియా సైనికులతో అవమానకరంగా మాట్లాడించిన సంగతి ప్రజలకు తెలుసు. రాజధాని అనే స్ఫూర్తిని ఒక కులానికి ముడిపెట్టి, పోరాడుతున్న మహిళల గురించి అసభ్యమైన తిట్లు తిట్టిస్తూ వైసీపీ ఎంతగా చెలరేగిందో కూడా అందరికీ తెలుసు. రాజధాని అమరావతిని నాశనం చేయడం అనేది.. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ పతనాన్ని నిర్దేశిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.