ఈ రోజుల్లో పాదనమస్కారాలు చేసే సంస్కృతి బాగా తగ్గింది. తల్లిదండ్రులకు, గురువులకు పాదాలకు ప్రణామం చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. వారు కూడా అలా చేయబోయిన పిల్లలను, వారించి లేవదీసి కౌగిలించుకుంటున్నారు. ఆ రకంగా పెద్దల ప్రేమ, పిల్లల భక్తి రెండూ ప్రకటితం అవుతున్నాయి. రాజకీయం, సినిమా వంటి రంగాల్లో గురుసమానులుగా భావించే వారికి, ఇలా చేస్తూ ఉంటారు కూడా. పాదనమస్కారాలు అనేది ఫ్యూడల్ బుద్ధులకు ఒక నిదర్శనంగా భావించేవారు పెరుగుతున్నారు. కానీ.. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెబుతున్న విషయాల్ని గమనిస్తే.. జగన్మోహన్ రెడ్డిలో ఎంత వక్రమైన ఫ్యూడల్ బుద్ధులు ఉన్నాయో కదా అనిపిస్తోంది. ఆయన తన పార్టీ నాయకులనుంచి పాదనమస్కారాలు కోరుకునే వారంటే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రధాని నరేంద్రమోడీ పట్ల అపరిమితమైన భక్తి ప్రపత్తులు ప్రకటిస్తూ ఉండేవారు. ప్రధాని రాష్ట్ర పర్యటనలకు వచ్చే సందర్భాల్లో ఎయిర్ పోర్ట్ లో విమానం దిగి ప్రధాని చెంతకు రాగానే.. జగన్ వంగి ఆయన పాదాలను స్పృశించి నమస్కరిస్తూ ఉండేవారు. ఇదంతా.. కేసులనుంచి రక్షణ పొందడం కోసమే చేస్తున్నారని, ప్రధాని ప్రాపకం కోసం ఈ రకంగా ఆరాటపడుతున్నారని పార్టీలోని కొందరు నాయకులు, జనం నవ్వుకునేవారు. అయితే జగన్ అంతటితో ఆగలేదు. పార్టీ నేతలు తన చర్యలు చూసి నవ్వుతారనే భయం ఆయనకున్నదేమో తెలియదు గానీ.. పార్టీ నేతలు తనకు పాదనమస్కారాలు చేస్తేనే వారికి ‘లిఫ్ట్’ ఇవ్వాలనేది ఒక పాలసీగా పెట్టుకున్నట్టు ఇప్పుడు అనిపిస్తోంది.
మంత్రి వాసంశెట్టి సుభాష్ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదేళ్లపాటు ఉన్నారు. ఆయన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ ఓ సంగతి చెప్పారు. వైకాపా పాలన చివరి రోజుల్లో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారన్నారు. మిథున్ రెడ్డిని కలిశాక, ధనంజయ్ రెడ్డి వద్దకు వెళ్లమన్నారని, ఆయన వద్దకు వెళితే జగన్ కు సాష్టాంగ ప్రమాణం చేయాల్సి ఉంటుందని చెప్పారని సుభాష్ బయటపెట్టారు. మంత్రి వేణు కూడా అలాగే చేస్తారని ధనంజయరెడ్డి చెప్పడంతో ఆశ్చర్యపోయానన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా వేదికల మీద కొందరు నాయకులు పాదనమస్కారాలు చేస్తుంటారు. వారిని ఆయన వారించి పైకి లేపుతుంటారు. కొందరు వయోతారతమ్యం ఎక్కువగా ఉండేవాళ్లు, కేవలం చంద్రబాబు దయతోనే రాజకీయంగా ఎదిగిన వారు తమ స్వబుద్ధితో ఇలా చేసినా ఒక రకంగా ఉంటుంది. కానీ.. తన పార్టీలోని వారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటే.. వారు తనకు పాదనమస్కారం చేయాలని కోరుకునే వక్రబుద్ధి జగన్ కు మాత్రమే ఉంటుందని ప్రజలు విస్తుపోతున్నారు.