ఒకవైపు శాసనసభకు హాజరు కాకపోతే.. తమను అనర్హులుగా ప్రకటించేసి.. తమ సీట్లలో ఉప ఎన్నికలు ప్రకటిస్తారని ఒళ్లంతా భయం.. నేను సింహాన్ని, అర్జునుడిని అని ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు నేను మాత్రం సభకు హాజరు కాను.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాళ్లు విసిరిన జగన్మోహన్ రెడ్డి.. ఎట్టకేలకు ఒక మామూలు ఎమ్మెల్యేగా బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. వేటు పడుతుందనే భయం ఆయనను అయిష్టంగానైనా సభకు లాక్కువచ్చిందనేది స్పష్టం. అయితే సభకు వచ్చిన దగ్గరినుంచీ జగన్మోహన్ రెడ్డి.. ఆయన అనుచర గణాలు అల్లరిమూకల్లగా ప్రవర్తిస్తూ తమ పార్టీ పరువు తామే తీసుకోవడం విశేషం.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన సభకు నివేదించారు. అయితే గవర్నరు అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైన క్షణం నుంచీ జగన్మోహన్ రెడ్డి దళాలు.. నానా గోలగా అరచి నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూనే ఉన్నారు.
ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. వియ్ వాంట్ జస్టిస్.. ప్రజల గొంతును వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ.. రకరకాలుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభలో కూర్చున్నంత సేపు విచ్చలవిడిగా గవర్నరు ప్రసంగానికి అడ్డు తగులుతూ రచ్చరచ్చ చేసిన సభ్యులు.. కాసేపు తర్వాత సభను బాయ్ కాట్ చేశారు. అందరూ కలిసి మూకుమ్మడిగా వాకౌట్ చేశారు.
బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అయిన గవర్నరు మాట్లాడుతున్నప్పుడు కనీస సంస్కారం, సభా మర్యాద పాటించాలనే ఆలోచన కూడా లేకుండా జగన్ మూకలు వ్యవహరించడం విశేషం. కేవలం తమ ఎమ్మెల్యే హోదాలు మంటగలిసి పోకుండా కాపాడుకోవడానికి మాత్రమే వైసీపీ సభ్యులు సభకు వచ్చినట్టుగా కనిపించింది. కాసేపు కూర్చుని మొహం చాటేసి పారిపోవడం కనిపించింది. వారి అల్లరి చిల్లర నినాదాల మధ్యనే, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా గవర్నరు అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తమ గోలను పట్టించుకునే దిక్కులేదని తెలిసిన తర్వాత.. వారు వాకౌట్ చేయడం గమనార్హం.