చిత్రంగా అనిపించినా ఇదే జరుగుతోంది. వెళ్లిపోయిన నాయకులపట్ల ప్రేమ ఒలకబోస్తూ వారిని దువ్వుతూ ఉంటే.. మళ్లీ ఏదో ఒక నాటికి ప్రలోభపెట్టి తమ పార్టీలోకి తీసుకోవచ్చునేమో అనే దింపుడుకళ్లెం ఆశ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్ దళాలు, తైనాతీలలో ఉన్నట్టుగా ఉంది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ నాయకత్వాన్ని ఛీకొట్టినట్టుగా.. ఆయన ఇచ్చిన చట్టసభ పదవులను కూడా కాలదన్నుకుని వెళ్లిపోయిన నేతల గురించి జగన్ దళాలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. వెళ్లిపోయిన వారందరూ కేవలం.. తెలుగుదేశం ప్రభుత్వం వేధింపులు భరించలేక, వారు పెట్టే కేసులను తట్టుకోలేక మాత్రమే కూటమి పార్టీల్లో చేరుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం.. పోయే వారిని పోనివ్వండి. వారు వెళితే మనం కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకుంటాం. పార్టీలో ఉండేవాళ్లే మనకి చాలు.. లాంటి డైలాగులు వల్లిస్తూ ఉంటారు. ఎంత సీనియర్ నాయకులు, ఎంత కీలకమైన లోపాలను ప్రస్తావించి భంగపడి వెళ్లిపోయినా సరే.. తన అహంకారాన్ని ఆయన విడిచిపెట్టరు. పోయినోళ్లందరూ పనికిమాలిన వాళ్లు అన్నట్టుగానే మాట్లాడుతుంటారు. ఒక్క రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నప్పుడు మోపిదేవి విషయంలో మాత్రం జగన్ తేడాగా మాట్లాడలేదు. కానీ.. ఇప్పుడు ఆయన దళాలు మాత్రం.. వెళ్లిన వాళ్లందరూ ప్రభుత్వ వేధింపులు భరించలేకనే వలసపోయినట్టుగా చెబుతుండడం, పార్టీ కరపత్రికలో కథనాలు వండి వారుస్తుండడం గమనార్హం.
పైగా ఇప్పుడు వలస వెళ్లిన నాయకులు ఎవ్వరికీ కూడా వచ్చే ఎన్నికల్లో కనీసం టికెట్ దక్కే అవకాశం కూడా లేదని.. జగన్ దళాలు ఇప్పటినుంచే నీలిగూటి చిలకలాగా జోస్యాలు చెప్పడం ప్రారంభిస్తున్నాయి. ఇలాంటి కపట సానుభూతి ప్రదర్శించడం ద్వారా.. జగన్ దళాలు రెండు రకాల వ్యూహంతో రాజకీయ లబ్ధి ఆశిస్తున్నట్టుగా ఉంది. ఒకటి- వలస వెళ్లిన నాయకులు ఆ పార్టీల్లో క్రియాశీలంగా ఉండకుండా అక్కడ ఎంత కష్టపడినా దండగ, టికెట్ దక్కదుకదా.. అనే అపనమ్మకంలో వారిని ఉంచేయడం. రెండోది- ఈ కపట సానుభూతి వలన వారు ఇంకా వైసీపీతో టచ్ లో ఉన్నారేమో అనే భావన కలిగించి.. ఆయా పార్టీల అధినేతలు ఆ నాయకుల్ని పూర్తిగా నమ్మే పరిస్థితి లేకుండా చేయడం .. రెండు కుట్రలు అనిపిస్తోంది.
మోపిదేవి వెంకటరమణ, కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను, చివరికి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు కూడా తాము వైసీపీలో ఎంతటి పరాభవాల్ని అవమానాల్ని ఎదుర్కొన్నామో చెప్పి వెళ్తోంటే.. తెదేపా వేధింపులు తట్టుకోలేక వెళుతున్నారని ఆరోపించడం జగన్ తైనాతీలకు మాత్రం చెల్లిందని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.