ఎక్కడకు యాత్ర ప్లాన్ చేసినా ఎడాపెడా తోలించుకున్న జనాలతో హడావుడి చేయడం, నేను అడుగు బయటపెడితే చాలు.. జనం వెర్రెత్తిపోయి ఎగబడిపోతున్నారహో అంటూ టముకువేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. అలాంటి జగన్ కు.. నర్సీపట్నం ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. పోలీసులు విధించే నిబంధనలను అతిక్రమించడమే తనకు ఇష్టం అన్నట్టుగా చెలరేగి ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డికి నర్సీపట్నం నిరసనలతో కూడిన స్వాగతం చెప్పింది. ఈ నిరసనలు ఏవో రాజకీయ పరమైనవి మాత్రం కాదు.
అయిదేళ్ల పాలన కాలంలో.. ఆయన దుర్మార్గానికి, దుర్బుద్ధులకు నిలువెత్తు ప్రశ్నలు ఈ నిరసనలు. దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి అనుసరించే దుర్మార్గమైన వైఖరికి, దౌష్ట్యానికి నిదర్శనాలుగా ఈ నిరసనలు నిలిచాయి. దళిత డాక్టరు సుధాకర్ ను కేవలం.. మాస్క్ లు అడిగినందుకు .. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతగా టార్గెట్ చేసి, ఆయనను పిచ్చివాడిగా ముద్రవేసి బలితీసుకున్నదో.. యావత్ రాష్ట్రానికి మరొక్కసారి గుర్తుచేసేలా..జగన్ కు నిరసన అక్కడి ప్రజలు, దళితులు నిరసనలతో కూడిన స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. నిస్సంకోచంగా తాను చేయదలచుకున్న డ్రామాను చేసి వచ్చారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్టుగా ఒక పెద్ద ప్రహసనం నడిపించిన సంగతి అందరికీ తెలిసిందే. వైద్య కళాశాలలకు కేంద్రప్రభుత్వం భారీగా నిధులు అందిస్తూ సహకరిస్తున్న నేపథ్యంలో.. జగన్ ఆ కళాశాలల ప్రహసనం నడిపించారు. కేంద్రం ఇచ్చే నిధులతో కొన్ని కళాశాలలకు ఎడ్మిన్ బ్లాకులు పూర్తిచేశారు. నిర్మాణ పనులు తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంతే తప్ప రాష్ట్రప్రభుత్వం పూనిక వహించాల్సిన పనులేవీ పట్టించుకోలేదు. ల్యాబ్ లు లేకుండానే వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యాయి. లెక్చరర్లను పూర్తిస్థాయిలో నియమించలేదు. తూతూమంత్రంగా నడిపించారు.
ఇదంతా సరైన విధానం కాదని.. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం కాలేజీలను తమ ఆజమాయిషీలోనే ఉంచుకుంటూ, ప్రెవేటు యాజమాన్యాలను కూడా భాగస్వాముల్ని చేసి నిర్వహింపజేయడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాను పది-ఇరవైశాతం పూర్తిచేసి వదిలేసిన కాలేజీలు.. కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తయి, పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తే గనుక.. క్రెడిట్ మొత్తం చంద్రబాబునాయుడుకే దక్కుతుందని జగన్ కు కన్నుకుట్టింది. పీపీపీ అంటే అర్థం తెలియని అమాయకుడిలాగా.. కాలేజీలను ప్రెవేటుపరం చేసేస్తున్నారని అర్థంపర్థంలేని నిందలు వేస్తూ.. ప్రభుత్వాన్ని తూలనాడడానికి ఆయన సిద్ధమయ్యారు. ఆ డ్రామా కొనసాగిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లారు.
ఈ సందర్భంగా కరోనా కాలంలో పీపీఈ కిట్లు అడిగిన అనస్థీషియా డాక్టర్ సుధాకర్ ను జగన్ సర్కార్ వెంటబడి వేధించి బలితీసుకున్న వైనం గుర్తుచేస్తూ దళిత సంఘాలు మానవహారం ఏర్పాటుచేసి జగన్ కు స్వాగతం పలికాయి. నర్సీపట్నంలో పెద్దపెద్ద ఫ్లెక్సిలు వెలిశాయి. కరోనా మాస్క్ లు అడిగినందుకు డాక్టర్ ను బలితీసుకున్న జగన్ కు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే హక్కులేదంటూ.. ఈ ఫ్లెక్సిలు వేశారు. అయితే జగన్ ఇలాంటి అవమానాలను ఖాతరు చేసే వ్యక్తి కాదు గనుక.. యథావిధిగా తన కూలి జనాలతో జేజేలు కొట్టించుకుంటూ పర్యటన పూర్తిచేశారని ప్రజలు అనుకుంటున్నారు.