జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఆయన ఒక్కడికి మాత్రమే కాదు ఆయన ప్రాపకంలో ఉన్న, ఆయన ఆశ్రితులుగా రకరకాల పదవులు హోదాలు అనుభవిస్తున్న అందరికీ కళ్ళ ముందు అహంకారం పొరలు కమ్మాయి. విచ్చలవిడిగా చెలరేగుతూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంత దారుణమైన ఓటమి పలకరించిన తర్వాత వారందరిలో ఒక్కొక్కరికి కనుల ముందు కమ్మిన అహంకారపు పొరలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2029 నాటికి, లేదా ఆ తర్వాతి కాలానికి వైభవ స్థితి కాదుకదా.. మనగుడ ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో తమను తాను కాపాడుకోవడానికి ఒక్కరొక్కరుగా ఆ పార్టీని వదిలి పెడుతున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా- ఒక పనీ పాటా లేని పోస్టును అనుభవిస్తూ వచ్చిన సినీ నటుడు ఆలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు!
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాసక్తితో పార్టీలూ అటూ ఇటూ మారుతూ వచ్చిన ఆలీ.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దెబ్బకు.. ఆ పార్టీకి రాజీనామా చేయడం కాదు కదా.. ఏకంగా రాజకీయ సన్యాసమే చేసేశారు. ‘వైకాపానే కాదు. ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు. ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. నా సినిమాలు నేను చేసుకుందామని అనుకుంటున్నా’ అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆలీ చాలా సుద్దులు మాట్లాడారు. ఆయన రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదట. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు రాజకీయం కూడా తోడైతే ఇంకా బాగా పనిచేయవచ్చుననే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారట. 1999లో రామానాయుడుకు అనుకూలంగా ప్రచారం చేయడానికి మాత్రమే తెలుగుదేశంలో చేరానని ఆలీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ ఎవ్వరినీ తిట్టలేదని కూడా అంటున్నారు. కావొచ్చు గాక.. ఆలీ తెలుగుదేశంలో ఉండగా వేర్వేరు సందర్భాల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నించారు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా జనసేన తరఫున బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జరిగింది. అవన్నీ పుకార్లే అని తేలాయి. వైసీపీలో చేరిన తర్వాత పవన్ కల్యాణ్ తో విభేదించి ఆయన మీద చాలా సెటైర్లు వేశారు. తీరా.. జగన్ ప్రాపకంలో రాజకీయ హోదాను కొంతకాలం అనుభవించాక ఆ పార్టీ పతనం అయ్యేసరికి ఆలీ కనుల ముందు అహంకారపు పొరలు తొలగాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బాటలో ఇంకా చాలా మంది ఉన్నారని.. అహంకారం దిగి, వారంతా వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.