మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారో ఆయన సొంత పార్టీ వారికే అర్థం కావడం లేదు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కేసు లో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన దొరకడం లేదు. నోటీసులు అందుకోకుండా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు పరారీలో ఉంటూ దొంగాటలు ఆడుతుండడం గమనార్హం. బాధ్యత గల మంత్రి పదవిలో పనిచేసిన వ్యక్తి, విచారణకు సహకరించాలనే కనీస బాధ్యత తెలియకుండా.. విచారణను ఎదుర్కోవడం ద్వారా తన నిజాయితీని కూడా నిరూపించుకోవచ్చు అనే స్పృహ కూడా లేకుండా పరారైపోయి పోలీసులకు దొరకకుండా ఎంతకాలం తప్పించుకోగలరు అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
అక్రమ తవ్వకాలు రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర వ్యవహారాలపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ4 గా ఉన్నారు. అప్పటినుంచి కాకాని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయి మాట్లాడుతూ వచ్చారు. కేసులకు భయపడేది లేదని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలుగుదేశం శ్రేణులు ఇంతకు వంద రెట్లు మూల్యం చెల్లించుకుంటాయని ఆయన తీవ్ర స్థాయి బెదిరింపులకు దిగడం మొదలైంది. తాను ఎలాంటి తప్పులు చేయలేదని పదే పదే చెప్పుకున్నారు. తీరా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లే సమయానికి ఇంటి నుంచే పరారయ్యారు. నెల్లూరులో ఉన్న రెండు ఇళ్ళకు తాళాలు వేసి ఉన్నట్లుగా గుర్తించిన తర్వాత పోలీసులు వెనుతిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాదులో కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకుంటున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో కాకాణి గోవర్ధన రెడ్డి ఫోటోలు పోస్ట్ చేశారు వాటిని చూసిన వెంటనే పోలీసులు హైదరాబాదులోని ఆయన నివాసానికి రాగా అక్కడి నుంచి కూడా మాయమయ్యారు. దాంతో ఆయన బంధువులకే రెండో నోటీసు ఇచ్చి మంగళవారం ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పి పోలీసులు వెళ్లిపోయారు.
కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అనే సంగతి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియదా? ఇలా పరారవుతూ రోజులు నెడుతున్నంత మాత్రాన ఏదో ఒక నాటికి పోలీసులను ఫేస్ చేయాల్సి వస్తుందనే సంగతి ఆయనకు బోధపడడం లేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవరకు ఇలా పరారీలోనే గడపాలని అనుకుంటున్నారా? లాంటి సందేహాలు ప్రజల్లో మొదలవుతున్నాయి. పారిపోయి తప్పించుకునే గేమ్ కు కాకాని ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి!