సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా జనం రద్దీ పెరగడం, వర్షం కూడా తోడవడంతో అనుకోని దుర్ఘటన సంభవించింది. రిటైనింగ్ వాల్ కూలి భక్తులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. గాయపడిన వారిని చికిత్సకు తరలించింది. మరణించిన వారికి పాతిక లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం పరంగా ఏం చర్యలు తీసుకోగలరో అన్ని చర్యలూ తీసుకుంది. కానీ.. బాధ్యతగా ఉండవలసిన ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం.. శవాల మీద పేలాలు ఏరుకునే తన సహజమైన రాజకీయ దుర్నీతినే ఇక్కడ కూడా పాటిస్తున్నారు. హుటాహుటిన ఆయన విశాఖకు వచ్చేసి.. అక్కడ బాధితుల్ని పరామర్శిస్తున్నానంటూ పెద్ద డ్రామా నడిపించారు. ఎక్స్ గ్రేషియా పాతిక లక్షలు కాదు, ఏకంగా ఒక్కో మరణానికి కోటిరూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు తెన్నులు.. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడైనా శవాలు లేస్తాయా.. వెంటనే అక్కడ వాలిపోయి.. తన రాజకీయ లాభం కోసం తప్పుడు వ్యాఖ్యానాలు వినిపిస్తూ ప్రభుత్వం మీద బురద చల్లుదామా అని ఎదురుచూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సింహాచలం మరణాల దుర్ఘటన ఒక్కటే అయితే.. ఇలాటి వ్యాఖ్య చేయడం తొందరపాటు అవుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇంటినుంచి బయటకు వస్తుండడం అనేది చాలా అరుదుగా మాత్రమే. ప్రతివారం బెంగుళూరు వెళ్లడానికి ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తారు.
జైళ్లలో తమ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఉన్నప్పుడు మాత్రం వారితో ములాఖత్ కోసం వెళతారు. మిర్చి రైతుల కోసం అన్నట్టు ఒకేఒక్కసారి మిర్చియార్డు దాకా వెళ్లి వారి బాధలు విన్నారు. తతిమ్మా అని పర్యటనలు చచ్చిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లినవే. ఆ చావులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నవే. తెలుగుదేశం పార్టీ చేయించిన హత్యలు అని ఆరోపించడం మాత్రమే కాదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయించిన హత్యలు అని ఆరోపించడమే జగన్ కు రుచికరంగా ఉంటుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట మరణాల విషయంలో గానీ.. ఇవాళ సింహాచలంలో గోడకూలిన మరణాల విషయంలో గానీ.. ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునే నిందితుడిగా ఆరోపిస్తున్నారు.
జరిగింది ప్రమాదం. దీనికి అందరూ చింతిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకునేది గంటల్లో జరిగే పని కాదు.. విచారణకు చంద్రబాబు కమిటీని కూడా వేశారు. ఈలోగా.. జగన్ చేస్తున్న రాద్ధాంతం.. బాధితులకు కూడా అసహ్యకరంగా ఉంది. తన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గుర్తుంచుకుని ఆ కుటుంబంలో మరణించిన ఒక్కొక్కరికి కోటి వంతున ఇస్తానని.. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 25 లక్షలు పోగా.. మిగిలిన 75 లక్షల వంతున ఇచ్చేస్తానని ప్రగల్భాలు పలకడం చాలా లేకిగా ఉంది.